ఆధునిక పరిజ్ఞానం అందేలా..
కాటారం: పెరిగిన పెట్టుబడి, కూలీల కొరత, మద్దతు ధర లేకపోవడం లాంటి అనేక సమస్యలతో వ్యవసాయసాగులో సతమతమవుతున్న రైతన్నలను బాసటగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. సమస్యలను అధిగమించి వ్యవసాయం రైతులకు లాభసాటిగా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతునేస్తం ప్రారంభించింది. గతంలో మొదలైన రైతునేస్తంకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి రైతులు ఆధునిక వ్యవసాయ విధానాలు అవలంభించేలా ప్రభుత్వం చొరవ చూపుతుంది. ప్రధానంగా గ్రామీణ రైతులకు ఆధునిక సాగు విధానంపై సలహాలు, సూచనలు అందించి ప్రోత్సహిస్తే లాభసాటిగా అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అధికశాతం రైతులకు సరైన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో వ్యాపారులు సూచించిన సలహాలు పాటిస్తూ అధిక పెట్టుబడులతో తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి తోడు మండల కేంద్రాల్లో ఉండే వ్యవసాయశాఖ అధికారులను కలిసి పంటల సాగు విధానం గురించి తెలుసుకునేందుకు రైతులకు కష్టంగా మారింది.
రైతు వేదికల్లో రైతునేస్తం..
ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా అందిస్తున్న సేవలను రైతులకు మరింత చేరువ చేసేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మండలాల్లో ప్రతి ఒక క్లస్టర్‌కు రైతువేదికలను నిర్మించింది. ప్రతి రోజు ఈ కేంద్రాల్లో ఏఈఓ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. ఐదు గ్రామాలకు సంబంధించిన ఒక క్లస్టర్ రైతువేదిక ద్వారా వ్యవసాయ శాఖ సేవలను ఏఈఓలు రైతులకు అందిస్తూ వచ్చేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతు వేదికలను మరింత పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకుంది. ప్రతి మండలంలోని రైతులకు అందుబాటులో ఉండే విధంగా రైతునేస్తం కార్యక్రమం అమల్లోకి తీసుకొచ్చింది. రైతునేస్తంలో భాగంగా రైతువేదికలో వీడియో కాన్ఫరెన్స్‌లను ఏర్పాటు చేసింది. జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున 12 మండలాల్లో రైతువేదికల్లో రైతునేస్తం నిర్వహిస్తుండగా ప్రస్తుతం నూతనంగా మరో 20 కేంద్రాల్లో రైతునేస్తం కార్యక్రమం నిర్వహణ చేపట్టేలా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో జిల్లాలో ఇక నుంచి 32 కేంద్రాల్లో రైతునేస్తం సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
జిల్లా వివరాలు..
రైతులు 1,09,614
సాగు భూమి 2,17,164ఎకరాలు
వరి సాగు 1,12,218 ఎకరాలు
పత్తి 93,823 ఎకరాలు
ఇతరత్రా పంటలు 11,123 ఎకరాలు
సాగులో మెళకువలపై అవగాహన
జిల్లాలో 12 రైతు వేదికల్లో సేవలు
అందుబాటులోకి మరో 20 కేంద్రాలు
ప్రతీ మంగళవారం సలహాలు,
సూచనలు ఇవ్వనున్న శాస్త్రవేత్తలు
సాగు, పాడిపై సూచనలు, సలహాలు..
జిల్లాలోని రైతువేదికల్లో ఏర్పాటుచేసిన రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ప్రతి మంగళవారం శాస్త్రవేత్తలు రైతులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. సీజన్‌కు అనుగుణంగా ఆయా విభాగాల శాస్త్రవేత్తలు రైతులకు పంటల సాగుపై సలహాలు. సూచనలు అందిస్తున్నారు. వ్యవసాయంలో ఎరువుల యాజమాన్యం, వంగడాల ఎంపిక, కలుపు నివారణ, అధిక వర్షాల వేళ పంటల వారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలను శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. చిరుధాన్యాలు, వాణజ్య పంటలు, కూరగాయలు సాగు విధానాలను రైతులు అడిగి తెలుసుకొని సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. కాలానుగుణంగా పశువులకు అందించాల్సిన టీకాలు, పాడి అభివృద్ధిపై పాడి రైతులకు సంబంధిత శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీలు, దరఖాస్తు విధానాలను తెలియజేస్తున్నారు. జిల్లాలో 45 రైతువేదికలు ఉండగా 32 కేంద్రాల్లో రైతునేస్తం నిర్వహిస్తుండటంతో రైతులకు సేవలు మరింతగా అందుబాటులోకి రానున్నాయి.
రైతులకు సేవలు చేరువగా..
జిల్లాలోని రైతులకు ప్రభుత్వం ద్వారా వ్యవసాయసేవలు మరింత చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 12 కేంద్రాల్లో రైతునేస్తం కొనసాగుతుండగా ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాలతో మరో 20 కేంద్రాలలో అందుబాటులోకి తీసుకువచ్చాం. ప్రతి మంగళవారం రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు రైతులకు సాగుపై సూచనలు, సలహాలు అందిస్తున్నారు. రైతులు వ్యవసాయసాగులో ఆధునిక పద్ధతులు పాటించి అధికలాభాలు సాధించాలి.
– వీరూనాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
ఆధునిక పరిజ్ఞానం అందేలా..


