
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
రేగొండ: అర్హులందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పార్టీలకు అతీతంగా పేదలకు ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు.
పలువురి ఆందోళన..
మండలంలోని వెంకటేశ్వర్లపల్లి, కోనరావుపేట, కొత్తపల్లి (కె) గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసే క్రమంలో అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారంటూ పలువురు ఆందోళన చేపట్టారు. దీంతో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేయకుండా పేద ప్రజలను గుర్తించి వారికే అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
భావితరాలకు స్ఫూర్తి అంబేడ్కర్
కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో రూ.5 లక్షలతో డీఎంఎఫ్‌టీ నిధులతో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్‌ను భావితరాలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అనంతరం రేగొండ మండలం దమ్మన్నపేట రైతువేదికలో రైతు భరోసాపై సీఎం రేవంత్‌రెడ్డి సందేశాన్ని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి వీక్షించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో చెన్నాపూర్‌లో సబ్‌స్టేషన్ వద్ద ఏర్పాట్లను డీఎస్పీ సంపత్‌రావుతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, హౌసింగ్ పీడీ లోకిలాల్, పీఆర్ డీఈ రవికుమార్, తహసీల్దార్ లక్ష్మిరాజయ్య, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ రాంప్రసాద్, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ నడిపల్లి వెంకటేశ్వరరావు, కొడవటంచ ఆలయ డైరెక్టర్ ఆకుల రమేశ్, కాంగ్రెస్ నాయకులు నాయినేని సంపత్‌రావు, సూదనబోయిన ఓంప్రకాశ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు