
మధ్యాహ్న భోజన కార్మికుల ఇబ్బందులు
ఏటూరునాగారం: మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం అరకొరగా మెస్‌చార్జీలను పెంచడంతో తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం మధ్యాహ్న భోజన కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వంట కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు నెలలుగా వంట, కోడిగుడ్ల బిల్లులు, వేతనాలు రావడం లేదన్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభమైన అల్పాహారం బిల్లులు, వేతనాలు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు పాఠశాలలు ప్రారంభం కావడంతో బిల్లులతో కిరాణం, కూరగాయల వద్ద బిల్లులు చెల్లించకపోవడంతో అప్పు పుట్టడం లేదన్నారు. మెనూ ప్రకారం వంటలు చేయాలని కొందరు అధికారులు ఒత్తిడి చేయడం చూస్తుంటే, పొమ్మనలేక పొగ పెట్టినట్లుగా ఉందన్నారు. కోడిగుడ్లు పూర్తిగా ప్రభుత్వమే సరఫరా చేస్తేనే విద్యార్థులకు అందించడం సాధ్యం అవుతుందన్నారు. వంటగ్యాస్ భారాన్ని కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పారు. ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించే మెనూ చార్జీలు అరకొరగా పెంచి పెద్ద మొత్తంలో నిబంధనలు పెట్టడం దారుణమన్నారు. ఈ సమావేశంలో పోరెడ్డి ప్రమీల, రమ, చిటమట లక్ష్మీ, మట్టి లక్ష్మీ, ఇర్సవడ్ల నర్సమ్మ, మామిడి పార్వతి, కల్పన, మల్లమ్మ, కుప్ప చిన్నమ్మ, బొల్లె సత్తెమ్మ, రామక్క, గుంటి సరోజన, కుమ్మరి కొమురక్క పాల్గొన్నారు.
యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్