
భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకం
ములుగు: భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకమని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో మంగళవారం నిర్వహించిన లైసెన్స్ సర్వేయర్ల ధ్రువపత్రాల పరిశీలనకు కలెక్టర్ హాజరై మాట్లాడారు. జులై 26వ తేదీ వరకు ఇచ్చే శిక్షణ తరగతులను సర్వేయర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల సర్వే, ప్రాజెక్టుల భూ సేకరణ సర్వేలపై ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలన్నారు. రెవెన్యూ గ్రామాలు, మండలాల అంతర్గత సరిహద్దుల నిర్ణయంలో, వివాదాల పరిష్కారానికి చేపట్టే సర్వే ఎలాంటి అంతరాలకు గురికాకుండా ఉండాలన్నారు. అనంతరం లైసెన్స్ సర్వేయర్లకు సర్వే సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్‌జీ, అధికారులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్ల వివరాలు
ఎప్పటికప్పుడు వెల్లడించాలి
ధాన్యం కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు కలెక్టర్లు వెల్లడించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. మంత్రులతో కలిసి మంగళవారం ఆయన కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మేరకు జిల్లా తరఫున కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, సివిల్ సప్లయీస్ అధికారి షా ఫైజల్ హుస్సేన్ పాల్గొన్నారు. ఈ వీసీలో సీఎం మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. ఆయా మండలాల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ఘనంగా జరుపుకోవాలన్నారు. భూ భారతి చట్టాలను ప్రజలకు చేరువ చేయాలని, 3వ తేదీ నుంచి 20 వరకు మూడోదశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.