
సమావేశంలో మాట్లాడుతున్న రమేష్
భూపాలపల్లి అర్బన్: తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన హామీల అమలుకు సీపీఐ ఆధ్వర్యంలో బయ్యారంలో ప్రారంభమైన ప్రజా పోరుయాత్ర నేడు(బుధవారం) జిల్లా కేంద్రానికి చేరుకుంటున్న సందర్భంగా బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మోటపలుకులు రమేష్ తెలిపారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన చట్టంలో జిల్లాకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజాపోరుయాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ యాత్రకు ముఖ్య అతిథిగా పార్టీ అధ్యక్షుడు కూనమనేని సాంబశివరావు, యాత్ర కన్వీనర్ తక్కెళ్లపల్లి శ్రీనివాసరావులు హాజరుకానున్నట్లు తెలిపారు. బయ్యారం ఉక్కు పరిశ్రమను, కాజీపేటలో రైల్వే పరిశ్రమను స్థాపించాలని, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటకు నిధులు కేటాయించాలని, పోడు రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని, బొగ్గు గనుల ప్రైవేట్‌కరణ నిలిపివేయాలని, జనగామ వరకు ఇండస్ట్రీయల్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పోరుయాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంజూర్‌నగర్ నుంచి హన్‌మాన్ దేవాలయం వరకు మహాధర్నా నిర్వహించి అంబేద్కర్ సెంటర్‌లో సాయంత్రం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుగుణ, సతీష్, వెంకటేష్, ప్రవీణ్, శ్రీకాంత్, తిరుపతి, సిద్ధయ్యలు పాల్గొన్నారు.
హాజరుకానున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
సాంబశివరావు