
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ భవేష్ మిశ్రా
భూపాలపల్లి: ప్రతీ జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రస్తుత సంవత్సరంలో చేపట్టిన 9 నూతన వైద్య కళాశాలల పనులపై కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సంబంధిత ఇంజనీరింగ్ ఏజెన్సీల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులతో హైదరాబాద్ నుంచి మంత్రి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుత సంవత్సరం 9 జిల్లాల్లో నూతన వైద్య కళాశాలల పనుల జరుగుతున్నాయని తెలిపారు. వీటిపై జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతిరోజూ పనుల పురోగతి తెలుసుకుంటూ క్షేత్రస్థాయిలో వచ్చే చిన్న చిన్న సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పనులలో ఆటంకం కలుగవద్దని మంత్రి సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జయశంకర్ జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా మాట్లాడుతూ.. జిల్లా ఆస్పత్రిలో ప్రస్తుతం 180 పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 150 అదనపు పడకల ఏర్పాటుకు రూ. 13 కోట్లతో భవన నిర్మాణ పనులు చేపట్టి 60శాతం పూర్తి చేశామన్నారు. మే నెలాఖరుకు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. జిల్లా ఆస్పత్రికి సమీపంలో సింగరేణి ఆస్పత్రిలో 150 పడకలు ఉన్నాయని ఆ సదుపాయాలను సైతం వినియోగించుకుంటామని తెలిపారు. 60 మంది మహిళలకు, 40 మంది పురుషుల కోసం వేర్వేరుగా ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయని వాటిని హాస్టల్‌గా వినియోగించుకుంటామని తెలిపారు. వైద్య కళాశాలలో ల్యాబ్‌లు, తరగతి గదుల నిర్మాణానికి సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని, త్వరగా పనులు పూర్తి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన భూపాలపల్లిలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ గడువులోగా పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీరామ్ పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీశ్‌రావు