
భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయం
భూపాలపల్లి అర్బన్: రోజురోజూకూ అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి మున్సిపాలిటీకి రెగ్యులర్ కమిషనర్ రావడం లేదు. దీంతో ఎనిమిది నెలలుగా ఇన్‌చార్జ్ కమిషనర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బదిలీపై వచ్చిన కమిషనర్లు అనేక ఒత్తిడిల కారణంగా ఎక్కువ రోజులు విధులు నిర్వర్తించలేకపోతున్నారు. ధైర్యంచేసి విధులు నిర్వర్తించినా పని చేయనీయకుండా ప్రభుత్వానికి సరెండర్ చేయాలని పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవ తీర్మానాలు చేసి మరీ పంపిస్తున్నారు. దీంతో పనిచేసేందుకు అధికారులు ముందుకు రావడంలేదు. ప్రస్తుతం ఇన్‌చార్జ్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న టీపీఓ అవినాష్ సైతం బదిలీపై వెళ్లడం గమనార్హం.
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉన్నాయి. లక్షకుపైగా జనాభా నివాస్తున్నారు. ఈ పట్టణానికి రెగ్యులర్ కమిషనర్ ఉండాల్సిన స్థానంలో గతేడాది సెస్టెంబర్ మాసం నుంచి నేటి వరకు ఇన్‌చార్జ్ కమిషనర్‌తో పాలన నడుస్తోంది. కమిషనర్ స్థాయి అధికారి కూడా కాకుండా కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించి నెట్టుకొస్తున్నారు. రెగ్యూలర్ కమిషనర్ లేకపోవడంతో పట్టణంలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. సేవలు సకాలంలో అందడం లేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇద్దరు కమిషనర్ల సరెండర్..
భూపాలపల్లి మున్సిపాలిటీ కమిషనర్‌గా పనిచేస్తున్న వారికి పాలకవర్గ సభ్యులు ఏకమై ప్రభుత్వానికి సరెండర్, బదిలీ చేయాలని తీర్మానాలు చేస్తున్నారు. గతంలో పనిచేసిన ఇద్దరు కమిషనర్‌లను ఈవిధంగానే పంపించారు. 2020 అక్టోబర్‌లో అప్పటి కమిషనర్ సమ్మయ్య, 2022 ఆగష్టు 29న బిర్రు శ్రీనివాస్‌లను ప్రభుత్వానికి సరెండర్ చేయించారు. 2019 సంవత్సరంలో కమిషనర్లుగా ప్రశాంతి 15 రోజులు, వేణు 2 నె నెలలు, ఇన్‌చార్జ్ కమిషనర్లుగా గిరిధర్ 6 నెలలు, సుధీర్ 15 రోజుల పాటు పని చేశారు.
పని చేయలేం బాబోయ్..
8నెలలుగా మున్సిపాలిటీ కమిషనర్ పోస్టు ఖాళీగా ఉన్నప్పటికీ ఇతర మున్సిపాలిటీల నుంచి సీడీఎంఏ అధికారులు బదిలీచేసినా రావడం లేదు. అధికార, ప్రతిపక్ష నాయకుల ఒత్తిడి, స్థానిక సమస్యలను తట్టుకొని పనిచేయడం కష్టతరంగా ఉంటుందని భూపాలపల్లికి వచ్చేందుకు ధైర్యం చేయడం లేదని వినిపిస్తోంది. ఎనిమిది నెలలుగా ఇన్‌చార్జ్ కమిషనర్‌గా పనిచేస్తున్న టీపీఓ అవినాష్‌కు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌కు వారం రోజుల క్రితమే బదిలీ అయ్యారు. ప్రభుత్వం భూపాలపల్లికి కమిషనర్‌ను నియమించకపోవడంతో కలెక్టర్ భవేష్‌మిశ్రా ఆయనను రిలీవ్ చేయడం లేదు.
కుంటుపడుతున్న అభివృద్ధి
నెలల తరబడి కమిషనర్ లేకపోవడం, కార్యాలయంలో పనిచేస్తున్న టీపీఓకే ఇన్‌చార్జ్‌గా అదనపు బాధ్యతలు అప్పగించడంతో స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంతో ఆయన కుడా విధులను బాధ్యతయుతంగా నిర్వర్తించకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోంది. ప్రతి నెలా నిర్వహించాల్సిన సమావేశాలు సైతం నామమాత్రంగా నిర్వహిస్తున్నారు. నూతనంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రారంభించాల్సిన పనులు కూడా చేయలేకపోతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ కూడా అంతంత మాత్రమే ఉంది. కమిషనర్ లేకపోవడంతో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది కూడా సక్రమంగా విధులను నిర్వర్తించలేకపోతున్నారు.
భూపాలపల్లి మున్సిపాలిటీకి 8నెలలుగా ఇన్‌చార్జ్ అధికారి
ఇద్దరు కమిషనర్‌లను
సరెండర్ చేయించిన పాలకవర్గం
వచ్చేందుకు జంకుతున్న అధికారులు
పాలకవర్గ ఒత్తిడే కారణమా..!
మున్సిపాలిటీలో 30వార్డులు ఉండగా 26మంది అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లే ఉన్నారు. దీంతో మున్సిపాలిటీలో పనులు, బిల్లుల ఆమోదం, తీర్మానాల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. వీరు ప్రతిపాదించిన ప్రతి పనిని చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. పాలకవర్గ సభ్యులకు సహకరించకపోతే కమిషనర్, సిబ్బంది అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి బదిలీ, సరెండర్ చేయిస్తున్నారని పట్టణంలో చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ కౌన్సిలర్ల ఒత్తిడి కారణంగానే సక్రమంగా విధులు నిర్వర్తించకలేపోతున్నట్లు చర్చ జరుగుతోంది.