
– 8లోu
రాఘవరెడ్డిపేటలో వంతెన పిల్లర్ కిందనే ఇసుకను తోడుతున్న కూలీలు
చలివాగు, మానేరులో
ఇసుక దందా
● అధికార పార్టీ నాయకుల అండదండలు
● మామూళ్ల మత్తులో సంబంధిత అధికారులు
● ప్రభుత్వ ఆదాయానికి గండి
● ప్రమాదపుటంచున
టేకుమట్ల–రాఘవరెడ్డిపేట వంతెన
వంతెనకు
ప్రమాదం..
టేకుమట్ల–రాఘవరెడ్డిపేట వంతెన కింద చలివాగులో పిల్లర్ల కిందనే సుమారు ఐదు ఫీట్ల మేర ఇసుకను తవ్వారు. దీంతో పిల్లర్ల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. కేవలం పిల్లర్ల వద్దనే ఎక్కువ లోతులో ఇసుక తవ్వకాలు చేస్తున్నా అధికారులు మాత్రం ఇప్పటివరకు పట్టించుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యానికి సాక్ష్యంగా ఉంది.
టేకుమట్ల: టేకుమట్ల మండల పరిధిలోని చలివాగు, మానేరు వాగుల్లో అక్రమ ఇసుక అక్రమ రవాణా దందా పగలు, రాత్రి అనే తేడా లేకుండా సాగుతోంది. ఆదివారం వచ్చిందంటే అధికారులు ఎవరూ ఉండరనే ధైర్యంతో రోజంతా ఇసుకను తోడేస్తున్నారు. ట్రాక్టర్లు తహసీల్, పోలీస్‌స్టేషన్ల ముందునుంచే పోతున్నా అక్రమార్కులను అడ్డుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండిపెట్టి యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేపడుతూ సొమ్ముచేసుకుంటున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నారు.
టేకుమట్ల మండలంలోని చలివాగు, మానేరు పరీవాహక గ్రామాలైన సుబ్బక్కపల్లి, సోమనపల్లి, అంకుషాపూర్, టేకుమట్ల, రాఘవరెడ్డిపేట, గుమ్మడవెల్లి, ఎంపేడు, రామకిష్టాపూర్, ద్వారకపేట, వెంకట్రావుపల్లి, కలికోట శివారులో అక్రమంగా ఇసుక రవాణా సాగుతోంది. ఇసుక అక్రమ రవాణాకు ప్రత్యేక దారులను ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ పనుల పేరు చెబుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు.
8అడుగుల లోతు తవ్వకాలు..
భూగర్భ జలాలు అడుగంటకుండా ఉండేందుకు ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్దేశిత క్యూబిక్ మీటర్ మేర ఇసుకను తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారీల నుంచి కాకుండా ఎక్కడపడితే అక్కడ ఇసుక రవాణాకు ప్రత్యేకంగా రోడ్లను వాగు, మానేరులో ఏర్పాటు చేసుకుని రాత్రీ, పగలూ అనే తేడా లేకుండా తరలిస్తున్నారు. ఒక్కో చోట సుమారు 8అడుగుల మేర ఇసుకను తవ్వుతూ భూగర్భ జలాలు అడుగంటే విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎండాకాలం మొదలవడంతో పంటలకు నిత్యం నీరు అందించాల్సిన సమయంలో ఇసుక దందా కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
పట్టించుకోవాల్సింది వీరే..
ఇసుక అక్రమ రవాణాను రెవెన్యూ, మైనింగ్, అటవీ, పోలీస్ శాఖ అధికారులు అడ్డుకోవాలి. కేవలం చలివాగు, మానేరు ఉప్పొందిన రోజుల్లో మాత్రమే ఇసుక అక్రమ రవాణా నిలిచిపోతుంది. మిగతా సమయంలో నిరంతరంగా కొనసాగడంతో చలివాగు, మానేరు ప్రాంతాలు ఓపెన్ కాస్టులను తలపిస్తున్నాయి. ఇసుకతో లోడ్ చేసిన ట్రాక్టర్లు మండలకేంద్రంలోని తహసీల్దార్, పోలీస్‌స్టేషన్‌తో పాటు ప్రభుత్వ కార్యాలయాల ముందునుంచి పోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. నాలుగు శాఖల అధికారులు కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు బలంగా ఉన్నారు. ఇసుక దందా వెనుక అధికార పార్టీ నాయకులు ఉండడంతో పాటు మామూళ్ల ఆశతో పట్టించుకోవడం లేదనే అపవాదు అధికారులపై బలంగా వినిపిస్తోంది.
ఎక్కడికి తరలిస్తున్నారంటే..
ఇసుకను వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, రేగొండ, పరకాల, జమ్మికుంట తదితర మండలాలకు తరలిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అనే తేడా లేకుండా ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు.
38మందిపై కేసులు..
చలివాగు, మానేరు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఐదు నెలల్లో 38మందిపై కేసులు నమోదు చేశాం. ఇకపై కూడా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తాం.
– చల్ల రాజు, ఎస్సై, టేకుమట్ల
అధికారుల నిర్లక్ష్యంతోనే..
నాలుగు శాఖల అధికారుల నిర్లక్ష్యంతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. మండల కేంద్రం నుంచి నిరంతరం ఇసుక ట్రాక్టర్లు వెళ్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను చలివాగు నుంచి రాత్రి, పగలు అనే తేడా లేకుండా రవాణా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దాంతో చలివాగు పరీవాహక ప్రాంత రైతులు యాసంగి పంటలపై ఆశలు వదులుకునే పరిస్థితి దాపురించింది.
– బట్టల మొగిళి, రైతు. గుమ్మడవెల్లి
●
న్యూస్‌రీల్

టేకుమట్ల మండలంలోని చలివాగులో ట్రాక్టర్‌లో ఇసుకను నింపుతున్న కూలీలు




