చిల్పూరు: గ్రామంలో ప్రజా అవసరాల కోసం చేపట్టిన అభివృద్ధి పనులను సర్పంచ్ ప్రారంభించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా సర్పంచ్ భర్త ఆ కార్యక్రమాన్ని చేపట్టడం గమనార్హం. మండలంలోని లింగంపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో బోరు మోటార్‌ను సర్పంచ్ భూక్య సునిత ప్రారంభించాల్సి ఉండగా ఆదివారం ఆమె భర్త లాలు ప్రారంభించారు. ప్రోటోకాల్ ప్రకారం అడ్డుకోవాల్సిన పంచాయతీ కార్యదర్శి మహేందర్ సైతం స్వయంగా సర్పంచ్ భర్తతో కొబ్బరికాయ కొట్టించి ప్రారంభింపజేయడంపై విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, లింగంపల్లి సమ్మక్క సారలమ్మ జాతర మాజీ చైర్మన్ మోతె శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామంలో సర్పంచ్‌కు బదులు భర్త, కార్యదర్శి కలిసి పెత్తనం చెలాయిస్తున్నారని, ఈవిషయంపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
2కే రన్‌లో అధిక
సంఖ్యలో పాల్గొనాలి
జనగామ: ప్రజా పాలన –ప్రగతి ప్రణాళికలో భాగంగా స్పోర్ట్స్ అండ్ యూత్ వీక్ నేపథ్యంలో నేడు(సోమవారం)లో ఉదయం 6.30 గంటలకు కలెక్టరేట్ నుంచి మినీ స్టేడియం వరకు జరిగే 2కే రన్ ఉంటుందని జిల్లా యువజన, క్రీడల అధికారి ఎన్.లక్ష్మీనరసింహరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 7 గంటలకు మినీ స్టేడియంలో యోగా నిర్వహించనున్నట్లు తెలిపారు. యువత, క్రీడాకారులు, విద్యార్థులు, వాకర్స్ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
గోదావరిలో
ప్రముఖులకు దారి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వీవీఐపీల కోసం సరస్వతీఘాటు తీరం నుంచి త్రివేణి సంగమంలోని నీటి వరకు వెళ్లడానికి బారికేడ్లు ఏర్పాటు చేసి మధ్యలో మట్టిరోడ్డు వేశారు. దానిపైన మ్యాట్‌లు రానున్నాయి. అక్కడే కంటెయినర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. బయోటయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. జల్లు స్నానాలకు ఏర్పాటు చేస్తున్నారు. కుడి, ఎడమ వైపున సాధారణ భక్తులు స్నానాలకు వెళ్లేందుకు షమియానాలు, మ్యాట్‌లు వేయనున్నారు. తీరం నుంచి రెండు ద్వారాల ద్వారా భక్తులు తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేపట్టారు. సరస్వతీనది అంత్యపుష్కరాలకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారనే అధికారుల అంచనాతో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు వివిధ మార్గాల వద్ద 15 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. 21 నుంచి వన్‌వే అమలులోకి రావడంతో చెక్‌పోస్టుల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 21నుంచి జూన్ 1వ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు హోమాలు నిర్వహించడానికి దేవాదాయశాఖ శివ కల్యాణ మండపంలో ఏర్పాట్లు చేస్తుంది. హోమాల కోసం భారీ మంచుకొండల మాదిరిగా డెకరేషన్ సెట్టింగులు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా అచలాపురానికి చెందిన వేదపండితులు హోమాది పూజలు నిర్వహించనున్నారు.


