జీడికల్, నవాబుపేట ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తి..
జనగామ: జిల్లా వ్యాప్తంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవాలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలతో అలంకరించిన ఆలయాలు, పుష్పాలతో మండపాలు, భక్తుల కోలాహలంతో జిల్లా పండగ వాతావరణంలో మునిగిపోయింది. లింగాల ఘణపురం మండలం జీడికల్ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం, పాలకుర్తి మండలం వల్మిడి రామాలయం, చిల్పూరు మండలంలోని బుగులోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంతో పాటు జనగామ పట్టణంలోని పాతబీటు బజారు, బాణాపురం, ఆర్టీసీ బస్టాండు, గుండ్లగడ్డ శ్రీ ఉమామహేశ్వరస్వామి, శ్రీనగర్ కాలనీలోని సాయిరాం కన్వెన్షన్ హాల్‌లో ర ఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, బచ్చన్నపేట, జఫర్‌గఢ్, నర్మెట, జనగామ మండలాల్లో ఏర్పాట్లు పూర్త య్యాయి. నేటి(శుక్రవారం)మధ్యాహ్నం 12 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోక్తంగా సీతారాముల కల్యాణం జరగనుంది.
ఆధ్యాత్మిక ఉత్సాహం..
సీతారాముల కల్యాణ మహోత్సవం ప్రారంభ ఘట్టం భక్తులను ఆధ్యాత్మిక ఉత్సాహంతో నింపనుంది. రామయ్య కల్యాణం కనులారా వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. శాస్త్రోక్త పద్ధతుల్లో ఎదుర్కొళ్లు, మంగళాస్త్రం, తలాంబ్రాలు వంటి సంప్రదాయ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయాల కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేశారు.
వల్మిడిలో వైభవంగా..
పాలకుర్తి టౌన్: వాల్మికి మహాముని నడియాడిన నేల, తెలంగాణలో రెండో భద్రాద్రిగా వెలుగొందుతున్న పాలకుర్తి మండలంలోని వల్మిడిలో శ్రీరామ నవమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించేందుకు దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. రాముని గుట్ట(క్షేత్రం)పై నిర్వహించే సీతారాములు కల్యాణానికి వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. సీతారాముల కల్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు తెలిపారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి హాజరవుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు పాలకుర్తిలోని శ్రీసోమేశ్వర ఆలయం, పాటిమీద ఆంజనేయస్వామి ఆలయం, విస్నూరులో సీతారామచంద్రస్వామి కల్యాణానికి ఏర్పాటు చేశారు.
శ్రీసీతారాముల వివాహ మహోత్సవానికి ఆలయాల ముస్తాబు
ఆధ్యాత్మిక వైభవంగా కల్యాణ ఘట్టం
జీడికల్, వల్మిడి, నవాబుపేట తదితర
ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తి
లింగాలఘణపురం: మండలంలోని పలు గ్రామాల్లో శ్రీరామనవమి ఉత్సవాలకు ఏర్పాట్లను సిద్ధం చేశారు. ముఖ్యంగా నవాబుపేట కోదండరామస్వామి, జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవాలకు ఆలయాలను ముస్తాబు చేశారు. ఆలయ ప్రాంగణం, కల్యాణ మండపాల్లో చలువపందిళ్లు ఏర్పాటు చేశారు. నవాబుపేట కోదండరామస్వామి ఆలయంలో ఈ నెల 19న బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారం గరుడముద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గరుడముద్ద ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఈఓ లక్ష్మిప్రసన్న, సర్పంచ్ సదా నందం, వేదపండితులు లక్ష్మినర్సింహ్మచార్యులు, కృష్ణమూర్తి, భద్రినాథ్, విష్ణువర్ధన్, ఆలయ సిబ్బంది రాజేందర్‌రెడ్డి, అశోక్, రవితేజ, వసంత, రమేశ్,, ఎల్లగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


