లింగాలఘణపురం: ‘‘సారూ.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు.. పొట్టకొచ్చిన వరికి సాగునీరందించి ప్రాణం పోయండి.. చేతికొచ్చే దశలో ఉన్న వరి ఎండిపోతోంది..’’అని నెల్లుట్ల, పటేల్‌గూడెం రైతులు వేడుకుంటున్నారు. యాసంగిలో పొట్టదశలో ఉన్న వరికి కొన్ని గ్రామాల్లో సాగునీరు అందక ఎండిపోయే పరిస్థితి నెలకొంది. 15 రోజులుగా అశ్వరావుపల్లి రిజర్వాయర్ 16 ఎల్ కాల్వ నుంచి వస్తున్న నీటితో నెల్లుట్ల, లింగాలఘణపురం, పటేల్‌గూడెం గ్రామాల్లోని రైతులకు మేలు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే మళ్లీ కాల్వ నీరు తగ్గడంతో పొట్టకొచ్చి ఈనె దశలో ఉన్న వరి ఎండిపోయే ప్రమాదం నెలకొంది. దీంతో నెల్లుట్ల, పటేల్‌గూడెం గ్రామాల పరిధిలో సుమారు వంద ఎకరాలకు పైగా ఎండిపోతోందని, సాగునీరు అందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.


