హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్‌గా ఎస్.భవాని ప్రసాద్ బదిలీపై వస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న దర్శనం విజయభానును అదిలాబాద్ రీజినల్ మేనేజర్‌గా బదిలీ చేయగా, ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్‌గా పనిచేస్తున్న భవాని ప్రసాద్‌ను వరంగల్ రీజినల్ మేనేజర్‌గా నియమిస్తూ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయభానుపై పలు ఆరోపణలు రావడంతో బదిలీ జరిగిందనే ప్రచారం ఆర్టీసీ వర్గాల్లో సాగుతోంది.
యువతిని మోసం చేసిన వ్యక్తికి పదేళ్ల జైలు
వరంగల్ లీగల్ : ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన కేసులో నేరం రుజువుకావడంతో చెన్నారావుపేట మండలం జోజిపేటకు చెందిన నెలకంటి జోసెఫ్ తంబికి పదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ వరంగల్ జిల్లా మొదటి అదనపు కోర్టు జడ్జి జి.ప్రేమలతారెడ్డి గురువారం తీర్పు వెలువరించారు..ఖానాపురం మండలం మంగళవారిపేట గ్రామానికి చెందిన ఓ యువతి నర్సంపేటలోని సిద్ధార్థ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తన సోదరి ఊరైన చెన్నారావుపేట మండలం జోజిపేట గ్రామానికి వెళ్లిన వస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన జోసెఫ్ తంబితో పరిచయం ఏర్పడింది. నాలుగేళ్లు కొనసాగిన వారి స్నేహం ఆసరా చేసుకొని తనను ప్రేమిస్తున్నానని.. పెళ్లిచేసుకుంటానని నమ్మించిన జోసెఫ్ తంబి పలుమార్లు యువతిని లోబర్చుకున్నాడు. యువతి వివాహ విషయమై పలుమార్లు అడగగా జోసెఫ్ తంబి ఏదో కారణం చెప్పి తప్పించుకున్నాడు. ఖానాపురం పీఎస్‌లో సదరు యువతి ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. విచారణ లో నేరం రుజువైంది.


