నేనూ.. మీ గ్రామపంచాయతీని..
జనగామ: ఏడాదిన్నరగా గ్రామ పంచాయతీల్లో పాలకులు లేరు. అధికార ముద్రలేకుండా జీపీ కార్యాలయాలు బోసిపోయాయి. గ్రామాలు అనాథలా మూలనపడ్డాయి. ఈనేపథ్యంలో ఇదే నా కథ అంటూ ఓ గ్రామపంచాయతీ పడుతున్న ఆవేదన..
‘నా వీధులు చెత్తతో నిండిపోయాయి, నా డ్రైనేజీలు శిథిలమై మురుగునీటి వాసనతో ఊపిరి బిగపట్టేలా మారాయి. రాత్రి వీధిలైట్లు వెలగని పరిస్థితి. ఇవన్నీ చూసి అందరూ పడుతున్న బాధ, పౌరుల తిట్ల పురాణం అన్నీ నా గుండెల మీద బరువుగా పేరుకుపోయాయి. పంచాయతీ ఎలక్షన్లు లేకపోవడంతో ఒక సర్పంచ్ లేడు, నాయకత్వం అసలే లేదు.. ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపించకపోవడంతో ప్రజలు నిత్యం నాగురించే మాట్లాడుకునేలా చేసింది. ఎలక్షన్ల కోసం ఇన్నాళ్లు ఎదురు చూశాను. ఎన్నికల షెడ్యూల్ రావడం, రిజర్వే షన్లను ప్రకటించడం, పోలింగ్ సైతం దగ్గర పడడం.. ఊపిరి పీల్చుకునేలా చేసింది. జిల్లాలో మూడు విడతల్లో మరో 10 రోజుల్లో పాలక మండలి బాధ్యతల్లో కొత్త నాయకత్వం రానున్న వేళ నా గుండెల్లో కొత్త వెలుగుల్ని నింపనుంది. ఇన్నాళ్లు నేను, నా గ్రామం పడిన మానసిక క్షోభ, ప్రజలు పడ్డ యాతన తీరే అవకాశం రాబోతుంది. కొత్త సర్పంచులు, కొత్త వార్డు మెంబర్లు గ్రామానికి నూతన కలను తీసుకురావాల్సిన సమయం వచ్చేసింది. కానీ ఈ బాధ్యత అంత సులభం కాదు. సర్పంచ్ అంటే కత్తిమీద సాము. పగలు, రాత్రి సమస్యలే. ప్రజల అంచనాలు ఆకాశమే హద్దు. కానీ అదే సమయంలో అభివృద్ధికి మార్గం చూపేవారు కూడా వారే. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం, ప్రతీ పనిని జాగ్రత్తగా పర్యవేక్షణ చేయడం, అధికారులతో కలిసి తీసుకునే నిర్ణయాలే గ్రామాన్ని కొత్త దిశగా తీసుకెళ్లుంది. ఆ అవకాశం సర్పంచ్‌లకే ఉంటుంది. ఎందుకంటే గ్రామం అంటే కేవలం ఇళ్లు కాదు, ప్రతి ఒక్కరి వెనుక ఉన్న ఆశలు. ఇప్పుడు నా ఆశ ఏంటంటే ఈసారి వచ్చే నాయకత్వం నా ప్రజల సమస్యలను వినాలి. అర్థం చేసుకుని పరిష్కరించాలి. నా చీకటి వీధుల్లో మళ్లీ వెలుగు నిండాలి. నా డ్రైనేజీలు శుభ్రంగా ప్రవహించాలి. నా గ్రామం పరిశుభ్రంగా, పచ్చగా మారాలి. నేనిప్పుడు చెప్పేది ఒక్కటే. కొత్త సర్పంచ్‌లే వస్తే బాగుపతామని కలలు కన్నా గ్రామం, ఏడాదిన్నరగా ఎదురు చూసింది. ఇన్నాళ్లు మానసికంగా పడ్డ నా వేదన.. కొత్త పాలక మండళ్లతో పోతుందని నమ్మకంగా ఉంది.’
ఇట్లు
మీ గ్రామ పంచాయతీ


