అర్ధరాత్రి వరకూ నామినేషన్ల స్వీకరణ
● నేటినుంచి మూడో విడత నామినేషన్లు
● మూడు మండలాల్లో పూర్తయిన ఏర్పాట్లు
● ‘స్టేషన్’లో మొదలు కానున్న సమరం
జనగామ: జనగామ నియోజకవర్గంలో రెండో విడత నామినేషన్ల స్వీకరణ మంగళవారంతో ముగియగా... బుధవారం నుంచి పాలకుర్తి నియోజకవర్గంలోని మూడు మండలాల పరిధిలో మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈనెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి మండలాల పరిధిలోని 25 క్లస్టర్ల పరిధిలోని 91 గ్రామపంచాయతీలు, 800 వార్డుల పరిధిలో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 5 గంటలకు కేంద్రాల గేట్లను మూసివేస్తారు. ఆ సమయంలో నామినేషన్ కేంద్రంలో ఉన్న అభ్యర్థుల నుంచి మాత్రమే నామినేషన్లు స్వీకరించాలని కలెక్టర్ సూచించారు. నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల సంఘం జారీ చేసిన నియమాలకు లోబడి వ్యవహరించాలని, స్వీకరణ, పరిశీలన, అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
ముగిసిన రెండో విడత నామినేషన్లు
జనగామ నియోజకవర్గంలో నామినేషన్ల జోరు కొనసాగింది. చివరి రోజు అర్ధరాత్రి 2 గంటల వరకు రాజకీయ పార్టీలు, స్వతంత్రుల నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరించారు. బుధవారం నామినేషన్లను పరిశీలించనుండ గా, అదే రోజు చెల్లుబాటు అయ్యే నామినేషన్ల జాబితా ప్రకటిస్తారు. 4వ తేదీ వరకు అప్పీళ్లకు అవకాశం కల్పించగా, 5వ తేదీన వాటిని పరిష్కరిస్తారు. 6వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, ఆ తర్వాత తుది అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు.
స్టేషన్ ఘన్‌పూర్‌లో ఉపసంహరణ
మొదటి విడత ఎలక్షన్లు జరిగే స్టేషన్ ఘన్‌పూర్‌లో నామినేషన్ల అప్పీళ్ల పరిష్కారం ముగియగా, బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఇవ్వగా, వెంటనే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించి, గుర్తులను కేటాయిస్తారు. దీంతో పంచాయతీ సమరం మొదలుకానుంది. 11వ తేదీన మొదటి విడుత పోలింగ్ జరుగనుంది.


