బుజ్జగింపులు..బేరసారాలు
● ‘నాకు సర్పంచ్, నీకు ఎంపీటీసీ..’
అంటూ మంతనాలు
● నేటితో ముగియనున్న నామినేషన్ల
ఉపసంహరణలు
స్టేషన్‌ఘన్‌పూర్: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండల పరిధిలో ఇప్పటికే నామినేషన్లు, అప్పీళ్ల ఘట్టం ముగియగా నామినేషన్ల ఉపసంహరణకు బుధవారంతో గడువు ముగియనుంది. దాంతో గ్రామాల్లో రెబల్స్‌గా వేసిన అభ్యర్థుల బుజ్జగింపు పర్వాలు ఊపందుకున్నాయి. మండలంలో 15 గ్రామ పంచాయతీలు ఉండగా జిట్టెగూడెం తండా జీపీ ఏకగ్రీవం కాగా మిగిలిన 14 గ్రామాలకు ఎన్నికలు జరుగన్నాయి. మొత్తంగా సర్పంచ్ స్థానాలకు 91 మంది, వార్డు స్థానాలకు 352 మంది బరిలో ఉన్నారు. దాదాపు అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల ఖరారు అయినప్పటికీ పలు గ్రామాల్లో అదేపార్టీ నుంచి రెబల్స్‌గా ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు వేశారు. దాంతో ఆయా గ్రామాల్లో గ్రామ కాంగ్రెస్ కమిటీలు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి రహస్య సమావేశాలు నిర్వహిస్తూ బుజ్జగింపులు చేస్తున్నారు. పార్టీ నుంచి ఒక్కరే బరిలో ఉండాలని, మాట విని ఉపసంహరణ చేసుకున్న వారికి రానున్న రోజుల్లో సముచితస్థానం కల్పిస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో ఇద్దరు పోటీకి ఉన్న చోట ‘నాకు సర్పంచ్ అవకాశం ఇవ్వు.. నీకు ఎంపీటీసీగా సహకరిస్తా..’ అంటూ రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటూ బేరసారాలు చేస్తున్నారు. కాగా ఇప్పటికే పలు గ్రామాల్లో కాంగ్రెస్ రెబల్స్ అంశం ఎమ్మెల్యే కడియం శ్రీహరి వద్దకు చేరింది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గ్రామ, మండల కమిటీలు పనిచేస్తున్నాయి. పార్టీ బలపర్చిన అభ్యర్థికి సహకరించాలని కోరుతూ రెబల్స్‌ను పోటీ నుంచి తప్పించేలా పార్టీ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా బుధవారం సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియనుండగా ఏ గ్రామంలో ఎందరు బరిలో ఉంటున్నారు, ఏగుర్తులు వచ్చాయి అనేది తేలనుంది.


