బెల్ట్ జోరు!
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 2 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
గ్రామాల్లో ఎన్నికల వేళ మద్యం జోరు
● రాత్రికి రాత్రే రవాణా
● 3వేల దుకాణాల్లో పెరిగిన వ్యాపారం..!
● పశువుల కొట్టాలు, వ్యవసాయ క్షేత్రాల్లో డంప్
● జిల్లాలో ‘ఫుల్’ జోష్
జనగామ: జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ఊపందుకుంటున్న వేళ మద్యం అమ్మకాలు ఊహించని విధంగా పెరిగింది. నామినేషన్ల ఊపు కొనసాగుతున్న సమయంలో మద్యం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ప్రచారంలో తమవైపు తిప్పుకునేందుకునే ప్రయత్నాల్లో రాత్రికి రాత్రే శివారు దారుల మీదుగా లక్షల రూపాయల మద్యాన్ని దాటించేస్తున్నారు. గ్రామాల్లో రాజకీయ వేడి పెరిగేకొద్ది మద్యం వినియోగం కూడా అదేస్థాయిలో పెరుగుతోందనే ఆరోపణలు లేకపోలేదు.
ఓవైపు నామినేషన్లు.. మరోవైపు అమ్మకాలు
జిల్లాలో మూడు విడతల్లో సర్పంచ్ ఎలక్షన్లు జరుగనున్నాయి. మొదటి విడతలో స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో నామినేషన్ల స్వీకరణ ముగియగా, జనగామ నియోజకవర్గంలో ప్రారంభమైంది. మూడో విడతలో పాలకుర్తిలో ప్రారంభం కావాల్సి ఉంది. ఎలక్షన్ నేపధ్యంలో మద్యం, డబ్బుల తరలింపుపై ఎలక్షన్ విభాగం గట్టి నిఘా వేసింది. ఒత్తిడితో పాటు ఎన్నికల సమయంలో మద్యం కొరత ఉండకూడదనే ఉద్దేశ్యంతో బెల్ట్ దుకాణాల వ్యాపారులు అర్ధరాత్రి సమయంలో మద్యం తరలించి రహస్య ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారు. ప్రతీ గ్రామంలో మద్యం ప్రవాహం పెరగడంతో ఎన్నికల నైతికతపై ప్రజల్లో సందేహాలు మొదలయ్యాయి.
పెరుగనున్న మద్యం వ్యాపారం
జిల్లాలో 280 గ్రామపంచాయతీలు, దాదాపు 300 పైగా శివారు గ్రామాల పరిధిలో 3వేల వరకు బెల్ట్ షాపులు నడుస్తున్నాయని అంచనా. బెల్ట్ దుకాణాల్లో రూ.10 వేల నుంచి రూ.ఒక లక్ష వరకు రోజు వ్యాపారం జరుగుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. కాని స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ వ్యాపారం రెట్టింపుగా దూసుకువెళ్తోంది. పలువురు ఓటర్లను ఆకర్షించడంలో నగదు, గిఫ్ట్‌లతో పాటు మద్యం కీలక పాత్ర పోషిస్తుంది. రోజువారీగా ఒక్కో బెల్ట్ దుకాణం నిర్వాహకుల కొనుగోలు కంటే అదనపు ఖరీదు చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా క్వార్టర్, ఆఫ్ బాటిల్స్‌లే ఉంటున్నాయి.
వ్యవసాయ క్షేత్రాలు..పశువుల కొట్టాలు..
ఎలక్షన్‌కు రెండు రోజుల ముందు భారీగా మద్యం బాటిల్స్ అవసరమున్న నేపధ్యంలో వ్యవసాయ క్షేత్రాలు, పశువుల కొట్టాలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, అనుమానం రాని వ్యక్తుల నివాస ప్రాంతాల్లో అదనపు మద్యం స్టాక్‌ను డంప్ చేసినట్లు గ్రామాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలక్షన్ సమయంలో ప్రతీ చిన్న సమావేశంలో మద్యం విందులు ప్రధానంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మద్దతు దారులు చేజారి పోకుండా అభ్యర్థులు తమ శక్తినంతా ధార పోసి విందులతో మచ్చిక చేసుకుంటారు. ఎ న్నికల సమయంలో మూతబడాల్సిన బెల్ట్ షాపులు మేము లేనిదే ఎన్నికలు ఎలా జరుగుతాయనే దర్జాగా వెలగబెడుతున్నాయి. బెల్ట్ దుకాణాల నిర్వహణపై ఎక్కడా ఆంక్షలు కనిపించడం లేదని అనేక గ్రామాల ప్రజలు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. బార్డర్‌లో చెక్ పోస్టులు, పోలీసుల తనిఖీలు ఉన్నప్పటికీ, వారి కళ్లు గప్పి బెల్ట్ నిర్వాహకులు మద్యాన్ని గ్రామాలకు తరలించేస్తున్నారు. గ్రామాల్లో ‘ఫుల్ జోష్’లో నడుస్తున్న మద్యం రాజకీయాలు పంచాయతీ ఎన్నికలకు కొత్త రంగు పులముతుండగా, ఖర్చులో సైతం రెండవ అతి పెద్దదిగా నిలుస్తోంది.
బెల్ట్ జోరు!


