హెచ్‌ఐవీపై అపోహలు తొలగించాలి
● జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్‌రావు
జనగామ రూరల్: హెచ్‌ఐవీపై అపోహలు తొలగించాలని జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్‌రావు అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం వైద్య శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం 2002 నుంచి అనేక అవగాహన కార్యక్రమాలు, చికిత్స సదుపాయాలను అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 3,210 మంది ఎయిడ్స్ బాధితులుగా నమోదు కాగా అందులో 2,690 మంది మందులు తీసుకుంటూ ఆరోగ్యం మెరుగు పరుచుకుంటున్నారన్నారు. జిల్లాలో మూడు సంవత్సరాల్లో 46,000 టెస్టులు చేసి 35 మంది పాజిటివ్ గుర్తించామన్నారు. గర్భిణులకు టెస్టులు నిర్వహిస్తూ.. స్టాఫ్ నర్సులు, వైద్యులు ప్రజలకు సకాలంలో చికిత్స అందిస్తున్నారన్నారు. వ్యాధిపై అవగాహన పెంచుకోవాలని, భయపడకుండా సమీప ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకుని చికి త్స పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


