ఎన్నికలపై అవగాహన కల్పించాలి
జనగామ: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బరిలో నిలిచే అభ్యర్థులకు అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. శనివారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ఆయన మాట్లాడుతూ సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు తమ ప్రచారం కోసం పబ్లిక్ మీటింగ్, ర్యాలీలు, మైకుతో పాటు తదితర వాటి కోసం తహసీల్దార్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనుమతి పొందిన బహిరంగ సమావేశాలు, రోడ్ షోల వద్ద లౌడ్ స్పీకర్లు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకే ఉపయోగించాలన్నారు. వీటిని ఉల్లంఘించిన వారిపై పర్యవేక్షణ టీంలు లౌడ్ స్పీకర్లను జప్తు చేయడానికి అధికారం కలిగి ఉంటారన్నారు. ప్రచార వాహనాల వివరాలను తహసీల్దార్లకు ముందుగానే సమాచారం అందించాలన్నారు.
ప్రచార ఖర్చులు నమోదు చేయాలి
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులను నిర్ణీత ఫారంలో నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. అభ్యర్థుల ప్రచార ఖర్చు నమోదు చేసే అంశంపై వ్యయ పరిశీలకులు జయశ్రీ, ఖర్చుల మానిటరింగ్ నోడల్ ఆఫీసర్ కోదండ రాములు, మండల వ్యయ పరిశీలకులు, అన్ని మండలాల ఎంపీడీఓలతో కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత మేరకు ఖర్చు చేయాలనే అంశంలో ఎంపీడీఓలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్ టీ, ఎంసీ ఎంసీటీంలు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అభ్యర్థుల ఎన్నికల వ్యయ, ఖర్చులను పక్కాగా నమోదు చేయాలన్నారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు సమన్వయం చేసుకుంటూ పోటీలో ఉండే అభ్యర్థులకు నిర్ణీత గడువులోగా ఇవ్వాలన్నారు.


