రెబల్స్..తగ్గేదేలే!
పార్టీల నాయకత్వాలకు తలనొప్పి
మారుతున్న సమీకరణాలు..
జనగామ: సర్పంచ్ ఎన్నికలు రాజకీయ పార్టీలకు కత్తిమీద సాములా మారిపోయాయి. నోటిఫికేషన్ వెలువడిన క్షణం నుంచి గ్రామాలన్నీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. ప్రతి పంచాయతీలోనూ ఎవరు పోటీ చేస్తున్నా రన్న చర్చ హాట్ టాపిక్‌గా మారింది. అభ్యర్థుల ఎంపికలో పార్టీలు తీవ్రమైన పరీక్షను ఎదుర్కొంటున్నాయి. రెబల్ అభ్యర్థులు పార్టీల నాయకత్వాలకు సవాల్ విసురుతున్నారు. విబేధాలు, కుల సమీకరణలు, స్థానిక పరిస్థితులు కలిసి మరింత క్లిష్టం చేస్తున్నాయి. మొదటి విడత నామినేషన్ల ముగింపు దశలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది. రెండో విడతలో పోటీ హోరాహోరీగా ఉండొచ్చని అంచనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పార్టీల అంతర్గత లాబీయింగ్ ఇప్పటికీ ఆగలేదు. టికెట్ కోసం ఆశలు పెట్టుకున్న నాయకులు తమ బలగాలను రంగంలోకి దింపారు. పార్టీ కార్యాలయాల నుంచి గ్రామం వరకు ఎవరికి టికెట్ వస్తుందా అనే సందేహామే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎంలతో పాటు స్వతంత్రుల పోటీ అధినాయకత్వాల అంచనాలకు దొరకడం లేదు. దీంతో పార్టీల పెద్దలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా రెబల్ అభ్యర్థుల సమస్య చికాకు పుట్టిస్తోంది. టికెట్ రాకపోతే స్వతంత్రం గా పోటీ చేస్తామని చాలామంది ముందే ప్రకటన చేస్తూ పార్టీల నేతలను ఇబ్బందిలో పడేస్తున్నారు. వారిని బుజ్జగించేందుకు రాత్రిపూట మీటింగ్‌లు, ఆఫర్లు, భవిష్యత్‌లో నామినేటెడ్ పోస్టుల హామీలతో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఖర్చు, ఒత్తిడి ఈ రెండు అంశాలు ఇప్పుడు అభ్యర్థుల ఎంపికలో కీలకంగా మారాయి. కొన్ని గ్రామాల్లో అభ్యర్థుల ప్రచార ఖర్చును ముందే ఫిక్స్ చేసి, ఇంతకంటే తక్కువ ఉండొద్దంటూ ఆయా పార్టీ పెద్దలు స్పష్టంగా చెబుతున్నారు. గ్రామాల్లో ఇప్పటికే ప్రచార పర్వం మొదలైంది. ఎన్నికల క్యాంపెయిన్, ఒకరిపై ఒకరు ఆరోపణలతో పల్లె రాజకీయంలో హీటెక్కిపోతుంది.
కత్తిమీద సాములా సర్పంచ్
అభ్యర్థి ఎంపిక
స్పీడందుకున్న బుజ్జగింపుల పర్వం
తప్పుకుంటే ఎక్స్‌ట్రా ప్యాకేజీలు, ఆఫర్లు
మొదటి విడత పోలింగ్ జరుగనున్న స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని లింగాలఘణపురం, రఘునాథపల్లి, స్టేషన్‌న్ ఘన్‌పూర్, చిల్పూర్, జఫర్‌గఢ్ మండలాల పరిధిలో సర్పంచ్ నుంచి వార్డు వరకు సమీకరణాలు మారిపోతున్నాయి. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి నాయకత్వంలో యువ నాయకు ప్రశాంత్‌రెడ్డి వంటి నేతలు అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా రెబల్ బెడద లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రామాల వారీగా వచ్చే రిపోర్టుల ఆధారంగా ఎప్పటికప్పుడు మండల, గ్రామ నాయకత్వానికి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఎక్కువగా చికాకు కలిగించే గ్రామాలపై జోక్యం చేసుకుంటూ జనాదరణ కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అందరి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. అధిష్టానం ఆదేశాలు లేకుండానే టికెట్ కోసం ఆశలు పెట్టుకున్న నాయకులు మాత్రం ప్రచార మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఇప్పటికే మొదటి విడత నామినేషన్లు రాజకీయాలను మరింత వేడెక్కించాయి. రెండో విడత ఫైట్‌కు పార్టీ వ్యూహకర్తలు సిద్ధమవుతున్నారు. కొత్త పార్టీలో చేరే నాయకులు, రెబల్స్ ఎంట్రీ, నిమిషనిమిషానికి మారే మార్పులతో జిల్లా మొత్తం ఇప్పుడు ఎన్నికల హైవోల్టేజ్‌లో మునిగి తేలుతోంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో అనేక గ్రామాల్లో రాయకీయ ఆట పూర్తిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏ పార్టీ ఎలా నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు జిల్లాలో మాట్లాడుకుంటున్నారు.
రెబల్స్..తగ్గేదేలే!
రెబల్స్..తగ్గేదేలే!


