వీడిన నాలుగు దశాబ్దాల ఉద్యమబాట
జనగామ/ దేవరుప్పుల: ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మరో మావోయిస్టు కీలక నేత పవనాంద్‌రెడ్డి అలియాస్ చైతు అలియాస్ శ్యామదాదా శుక్రవారం అడవిబాట వీడారు. ఆయన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా పోలీసు అధికారులు, భద్రతాదళాల ఎదుట లొంగిపోయారు. జిల్లాలోని చిల్పూరు మండలం పల్లగుట్టకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గీరెడ్డి దామోదర్‌రెడ్డి–అండాళ్లు దంపతుల కుమారుడైన పవనాంద్‌రెడ్డి హనుమకొండలో ఉన్నత విద్యనభ్యసించే క్రమంలో ఆర్‌ఎస్‌యూనుంచి సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్‌లోకి వెళ్లారు. తొలుత 1982–83లో జనగామ ప్రాంతంలో సింగిల్ ఆర్గనైజర్‌గా పనిచేసిన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే 1989–90 ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్ జిల్లా గడ్చిరోలి జిల్లా ట్రిపుర్‌ఘడ్ ఏరియాలో పార్టీ విస్తరణలో భాగంగా డిప్యూటీ కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించారు. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ విస్తరణలో భాగంగా తన తండ్రి ఉపాధ్యాయుడి వృత్తికి కొనసాగింపుగా అక్కడి నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పేందుకు మాస్టారుగా కీలక బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు మొబైల్ మాస్ స్కూల్, మొబైల్ పొలిటికల్ స్కూల్ నిర్వహించారు. 2008లో దర్బా ఏరియాలో నిత్యనిర్బంధంలో పార్టీకి పట్టుదొరికేలా పాటుపడ్డారు. అక్కడి ప్రభుత్వం దృష్టిలో పడకుండా అప్పటికే వివాహం చేసుకున్న పవనాంద్‌రెడ్డి దంపతులను కేంద్ర కమిటీ టెక్నికల్ విభాగంలో కీలక బాధ్యతలు అప్పగించారు. 2000 సంవత్సరంనాటికి బయట పరిస్థితుల నేపథ్యంలో తిరిగి అటవీ ప్రాంతమైన బస్తర్‌లో దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సీనియర్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2013లో జరిగిన జిరామ్ వ్యాలీ దాడి సూత్రధారుల్లో ఒకరిగా పరిగణించిన చైతు అలియాస్ శ్యామ్‌దాదాకు అక్కడి ప్రభుత్వం మోస్ట్‌వాంటెడ్ కావడంతో ఆయన తలపై రూ.25 లక్షల రివార్టు ప్రకటించింది. చైతు సహా పది మంది నక్సలైట్లు శుక్రవారం సుక్మా జిల్లాలో పోలీసు ఎదుట లొంగిపోయారు. కాగా, ఈయన భార్య స్వప్న డివిజనల్ కమిటీ సభ్యురాలిగా కొనసాగే క్రమంలో ఈ ఏడాది జూన్‌లోనే గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోవడం గమనార్హం. కాగా, పవానంద్‌రెడ్డి తల్లిదండ్రులు ప్రస్తుతం హనుమకొండలో నివాసం ఉంటున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత పవనాంద్‌రెడ్డి
ఆయన స్వస్థలం చిల్పూరు మండలం పల్లగుట్ట
దండకారణ్యంలో మాస్టారుగా కీలక బాధ్యతలు
మొబైల్ మాస్, పొలిటికల్ స్కూళ్ల ఏర్పాటు సూత్రధారి


