జోరందుకున్న బుజ్జగింపులు
స్టేషన్‌ఘన్‌పూర్: సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఈనెల 29(శనివారం)న ముగియనుండగా గ్రామాల్లో బుజ్జగింపులు, రహస్యసమావేశాలు ఊపందుకున్నాయి. మండలంలో 15 గ్రామ పంచాయతీలు ఉండగా సగానికి పైగా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల ఖరారు ఇప్పటికీ కాలేదు. గ్రామ కాంగ్రెస్ కమిటీలు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి గ్రామాల్లో ఆశావహులతో రహస్య సమావేశాలు నిర్వహిస్తూ బుజ్జగింపులు చేస్తున్నారు. మండలంలోని ఇప్పగూడెం, తానేదార్‌పల్లి గ్రామాల్లో అధికార పార్టీ నుంచి ప్రధానంగా ఇద్దరిద్దరు ఆశిస్తుండగా బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పగూడెంలో మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు కసరత్తులు చేశారు. నామినేషన్ల ఘట్టం ముగుస్తుండగా రెబల్స్ అధిక సంఖ్యలో నామినేషన్లు వేయనున్నారు.


