పోలీసులు ప్రాణరక్షకులు
● పోలీసు అమరులకు కలెక్టర్
షేక్ రిజ్వాన్ బాషా నివాళి
రఘునాథపల్లి: శాంతిభద్రతల పరిరక్షణ మాత్రమే కాకుండా విపత్తులు సంభవించినప్పుడు..ఇతరత్రా సందర్భాల్లో ప్రజల ప్రాణాలు కాపాడుతూ పోలీసులు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం రఘునాథపల్లి పోలీస్‌స్టేషన్ ఆవరణలో అమరవీరుల స్మారక స్తూపానికి వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలతో కలిసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి అమరులైన పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. అనంతరం నిజామాబాద్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్‌కుమార్ వీర మరణంపై సంతాపం తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ పండరి చేతన్‌కుమార్, ఏసీపీలు బీంశర్మ, అంబటి నర్సయ్య, సీఐలు ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, జానకిరాంరెడ్డి, శ్రీనివాసరావు, అబ్బయ్య, సత్యనారాయణరెడ్డి, ఎస్సైలు దూదిమెట్ల నరేశ్, వినయ్‌కుమార్, శ్రవణ్, భరత్, రామారావు, నవీన్, హమీద్, చెన్నకేశవులు, రాజేష్, నగేష్, సాయిబాబు, రాజు, ఏఎస్సై బత్తిని కట్టమల్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
పౌష్టికాహారం అందించాలి..
విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందజేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. మండలంలోని ఖిలాషాపూర్ కస్తూర్బా పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. స్టాఫ్ రిజిస్టర్‌ను పరిశీలించి అటెండ్ అయిన టీచర్లు, లీవ్ పెట్టిన టీచర్ల వివరాలను స్పెషల్ అధికారిని అడిగి తెలుసుకున్నారు.
‘ధన్‌ధాన్య’ యాక్షన్ ప్లాన్ సిద్ధం
జనగామ రూరల్: వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచి స్థిరమైన పద్ధతులను ప్రోత్సహిస్తూ గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచడానికి రూపొందించిన సమగ్ర వ్యవసాయ కార్యక్రమం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. కార్యక్రమ అమలుకు వివిధ శాఖల ద్వారా చేపట్టాల్సిన కార్యాచరణపై వీసీ ద్వారా సమీక్షించారు.
‘తెలంగాణ రైజింగ్’ సర్వేలో 3 లక్షల మంది
రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకు ఉద్దేశించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. దేశ స్వాతంత్య్రానికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల సూచించాలని, 25వ తేదీతో సర్వే ముగుస్తుందన్నారు.


