నేటినుంచి పత్తి కొనుగోళ్లు
జనగామ: జిల్లాలో ఈనెల 24 (శుక్రవారం) నుంచి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ‘పత్తి రైతుకు చిల్లర దాగా–సీసీఐ కొనుగోలు కోసం ఎదురుచూపులు’ శీర్షికన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈమేరకు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు జిల్లా మార్కెటింగ్ అధికారి బి.నరేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. జనగామ మండలం ఓబుల్‌కేశ్వాపూర్ శ్రీ వెంకటేశ్వర కాటన్ ఇండస్ట్రీస్‌లో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్ ప్రారంభించనున్నారు. జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలో 15 సీసీఐ సెంటర్లు ఏర్పాటు చేస్తుండగా, ఈనెల 27నుంచి రైతుల స్లాట్ బుకింగ్ ఆధారంగా వంద శాతం సెంటర్లను ప్రారంభించనున్నారు. 2025–26 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పత్తి పంటకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,110లుగా నిర్ణయించింది. 8 నుంచి 12 శాతం వరకు ఒక్కో శాతం పెరిగిన కొద్దీ ధర శాతం తగ్గుతుంది. 12శాతం కంటే ఎక్కువ తేమ ఉన్న పత్తిని సీసీఐ కొనుగోలు చేయదు. ఈ విషయాన్ని రైతులు దృష్టిలో ఉంచుకుని పత్తిని ఇంటివద్దే ఆరబెట్టుకుని నాణ్యత ప్రమాణాలు పాటించిన తర్వాతనే సీసీఐ కేంద్రానికి తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. రైతుల సౌకర్యార్థం పత్తి కొనుగోళ్ల సమయంలో ముందస్తు స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. పత్తి రైతులు ముందుగా కపాస్ కిసాన్ యాప్‌లో జిన్నింగ్ మిల్లును ఎంపిక చేసుకొని, స్లాట్ బుక్ ద్వారా తేదీ ప్రకారం, తేమశాతం లేకుండా సీసీఐ సెంటర్‌కు వచ్చి పత్తిని అమ్ముకోవాలని సూచిస్తున్నారు. కపాస్ కిసాన్ యాప్‌పై సందేహాలు ఉంటే సమీప మార్కెట్ కమిటీ లేదా విస్తరణ అధికారులను సంప్రదించాలన్నారు. రైతులు సీసీఐ కేంద్రానికి వచ్చే సమయంలో ఆధార్ కార్డ్, పట్టాదార్ పాస్‌బుక్, ఆధార్‌కు అనుసంధానించిన మొబైల్ నెంబర్ తీసుకొని రావాలని డీఎం సూచించారు.
ఓబుల్ కేశ్వాపూర్ మిల్లులో కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభం
పాలకుర్తిలో ఐదు చిల్లర కాంటా దుకాణాలపై దాడులు
నోటీసుల జారీ, మూసివేత
నేటినుంచి పత్తి కొనుగోళ్లు
నేటినుంచి పత్తి కొనుగోళ్లు


