నేటినుంచి కార్తీక మాస వేడుకలు
● పరమశివుడికి ప్రీతికరమైన పవిత్ర మాసం
● శివాలయాల్లో ప్రత్యేక పూజలు,
దీపారాధనలు
● ముస్తాబైన ఆలయాలు
జనగామ: పరమశివుడికి ప్రీతికరమైన కార్తీక మాస పర్వదిన వేడుకలు ఈనెల 22(బుధవారం) నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పవిత్ర మాసం సందర్భంగా జిల్లావ్యాప్తంగా శివాలయాలు విద్యుత్తు కాంతులతో వెలిగిపోతున్నాయి. బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్ధేశ్వరాలయం, పాలకుర్తి శ్రీ సోమేశ్వరస్వామి, జనగామ మండలంలోని చీటకోడూరు పంచకోసు రామలింగేశ్వర మల్లికార్జునస్వామి, పట్టణంలోని పాతబీటు బజారు శ్రీరామలింగేశ్వరస్వామి, శ్రీ సంతోషీమాత, శ్రీ చెన్నకేశ్వరస్వామి, గుండ్లగడ్డ శ్రీఉమామహేశ్వర, ఉప్పల మ్మ భవానీశంకర ఆలయం, దేవరుప్పుల, లింగాలఘనపురం, స్టేషన్‌న్‌ఘనపూర్, జఫర్‌గఢ్, చిల్పూరు, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి తదితర మండలాల పరిధిలోని శివాలయాల్లో కార్తీక మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని భక్తులు ఘనంగా పూజాకార్యక్రమాలు నిర్వహించనున్నారు.
బ్రహ్మముహూర్తంలో..
శివాలయాల్లో తెల్లవారుజాము 4.30 గంటలకు బ్రహ్మముహూర్త సమయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలతో పూజా కార్యక్రమాలు మొదలుకానున్నాయి. రోజువారీగా సత్యనారాయణ వ్రతాలు, అన్నపూజలు, దీపారాధనలు, స్వామి వారి సేవా కార్యక్రమాలు జరగనున్నాయి. ఒక్కసారైనా హర హర మహాదేవా అంటూ పరమశివుని సన్నిధిలో తలవంచితే, పాపాలు హరించి పోయి పుణ్యఫలాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.


