జీవాలకు టీకా రక్ష | - | Sakshi
Sakshi News home page

జీవాలకు టీకా రక్ష

Oct 16 2025 5:51 AM | Updated on Oct 16 2025 5:51 AM

జీవాల

జీవాలకు టీకా రక్ష

ఉచితంగా టీకాలు వేస్తాం

జనగామ రూరల్‌: పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం 6 నెలలకు ఒకసారి వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఈ సంవత్సరం ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో పశువైద్య బృందాలు ప్రతీ గ్రామాన్ని సందర్శించి, 3 నెలల వయస్సు దాటిన గేదె జాతి, గోజాతి పశువులకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వనున్నారు. ఏటా చలికాలంలో పశువులకు వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈనేపథ్యంలో పశుసంవర్ధక శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. బుధవారం నుంచి జిల్లావ్యాప్తంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రత్యేక కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని, పశువులకు టీకాలు వేయించాలని అధికారులు సూచిస్తున్నారు.

లక్షణాలు ఇవి..నివారణ ఇలా..

గాలికుంటు వ్యాధిలో గేదెలు, ఆవులకు వైరస్‌ సోకుతుంది. వ్యాధి సోకిన పశువులు బక్కచిక్కి అల్సర్‌ బారినపడతాయి. రెండు నుంచి ఆరు రోజుల వరకు జ్వరం ఎక్కువగా ఉంటుంది. నోరు, పెదాలు, నాలుకతో పాటు కాళ్ల గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి. మేత, నీళ్లు సరిగా తీసుకోవు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి పశువులు, దూడలు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈనేపథ్యంలో వ్యాధి సోకిన పశువులకు ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించాలి. పుండ్లను పొటాషియం పర్మాం గనేట్‌ లేదా నార్మల్‌ సైలెన్‌ వాటర్‌తో శుభ్రంచేయాలి. రెండోసారి ఇన్ఫెక్షన్‌ రాకుండా ఉండేందుకు యాంటీబయాటిక్స్‌ మందులు, వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి బీ కాంప్లెక్స్‌ మందులు వాడాలి. అలాగే గాలికుంటు వ్యాధిపై నిర్లక్ష్యం వహించకుండా పశుసంవర్ధక శాఖ వైద్యుల మేరకు క్రమం తప్పకుండా ఏడాదికి రెండుసార్లు టీకాలు వేయించాలి. వ్యాధి సోకిన పశువులను ఇతర పశువులతో కలిసి ఒకేచోట ఉంచొద్దు. వారానికి ఒకసారి కొట్టంలో సున్నం చల్లి క్రిమికీటకాల నివారణకు చర్యలు చేపట్టాలి. వ్యాధి సోకిన గేదె, ఆవు నుంచి తీసిన పాలను 100 డిగ్రీల సెల్సియస్‌ వరకు వేడి చేసిన తర్వాతే తాగాలి. ఒకవేళ పశువు చనిపోతే గోతిలో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లి పాతిపెట్టాలని పశువైద్యులు సూచిస్తున్నారు.

గ్రామాల్లో గాలికుంటు నివారణ టీకాలు

నెలరోజులపాటు కార్యక్రమం

సద్వినియోగం చేసుకోవాలని

పశువైద్యుల సూచన

జిల్లా వ్యాప్తంగా 1,45,000 పశువులు

జిల్లాలో నాలుగు ఏరియా పశువైద్యశాలలు ఉండగా 23 ప్రాథమిక పశువైద్యశాలలు ఉన్నాయి. 20 సబ్‌సెంటర్లు ఉన్నాయి. ఆవులు 73,482, గేదెలు 75,029 ఉన్నాయి. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమతో ఆర్థికంగా బలపడుతున్న రైతులు నష్టపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏటా రెండుసార్లు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. జిల్లాలోని 36 మండల టీంలు, 100 మందికి పైగా సిబ్బంది ఈనెల 15 నుంచి నవంబర్‌ 14 వరకు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్నారు. గ్రామాల వారీగా షెడ్యూల్‌ ప్రకారం ప్రతీరోజు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు టీకాలు వేస్తారు.

రైతులు పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ నెల 15 నుంచి గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. షెడ్యూల్‌ ప్రకారం నవంబర్‌ 14 వరకు అన్ని గ్రామాల్లోని పశువులకు ఉచితంగా టీకాలు వేస్తాం. మేకలు, గొర్రెలు, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకినా పశువైద్య సిబ్బందికి సమాచారం అందించాలి.

– ప్రాంతీయ పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకుడు

దేవేందర్‌

జీవాలకు టీకా రక్ష1
1/1

జీవాలకు టీకా రక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement