
నేడు ఆర్టీసీ ‘డయల్ యువర్ డీఎం’
జనగామ: జనగామ ఆర్టీసీ డిపోలో ఈనెల 16న (గురువారం) డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ స్వాతి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బచ్చన్నపేట, దేవరుప్పుల, లింగాలఘణపురం, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, మద్దూర్, పాలకుర్తి మండలాల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు సర్వీస్ సేవలకు సంబంధించి డయల యువర్ డీఎం ద్వారా సమస్యలతో పాటుగా సూచనలు, సలహాలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే డయల్ యువర్ డీఎం ప్రోగ్రాంలో–99592 26050 ఫోన్ నెంబర్ కు కాల్ చేయాలన్నారు.
జనగామ: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరంలో ఖాళీగా(మిగిలిన) ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు దరఖాస్తుల చేసుకోవాలని గురుకులాల జిల్లా సమన్వయాధికారి పి.శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. 5వ తరగతిలో ప్రవేశం కోసం కామన్ ఎంట్రెన్స్ వీజీటీ సీఈటీ–2025 రాసిన వారితో పాటు రాయనివారు కూడా అర్హులుగా పేర్కొన్నారు. 6వ తరగతి నుంచి 9వ తరగతుల్లో ప్రవేశం కోసం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బ్యాక్‌లాగ్ వేకెన్సీ ఎగ్జామ్ బీఎల్‌వీ సీఈటీ–2025 రాసిన వారితో పాటు రాయని వారు కూడా అర్హులన్నారు. ఎంట్రెన్స్ రాసిన ఎగ్జామ్ హాల్ టికెట్ (పరీక్ష రాసిన వారు), ర్యాంక్ కార్డ్ (పరీక్ష రాసిన వారు), కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు (పరీక్ష రాసిన వారు, రాయని వారు) వీటిని వెంట తెచ్చువాలన్నారు. ఆసక్తి గల వి ద్యార్థులు ఈనెల 16, 17 తేదీల్లో సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తును జనగామ సోషల్ వెల్ఫేర్ గురుకులంలో సమర్పించాలన్నారు. పరీక్ష రాసిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు. పరీక్ష రాసిన పిల్లలు అందుబాటులో లేని పక్షంలో పరీక్ష రాయని వారికి కలెక్టర్ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో సీట్లు కేటాయించడం జరుగుతుందన్నారు.
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
జనగామ రూరల్: రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన కమిటీ అధ్యక్షుడు బి.లక్ష్మయ్య డిమాండ్ చేశారు. బుధవారం సాధన కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. 18 నెలల నుంచి బకాయిలు చెల్లించకుండా జాప్యం చేయడం వల్ల రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందిపడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది పెన్షన్‌దారులు అప్పుల బాధలకు కుంగిపోయి చనిపోయారన్నారు. కార్యక్రమంలో అంబటి రాజయ్య, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి మాదిగలకు ఇవ్వాలి
జనగామ: కాంగ్రెస్ జనగామ జిల్లా అధ్యక్ష పదవి ఈసారి మాదిగలకు కేటాయించి సముచితమైన స్థానం కల్పించాలని కోరుతూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు జనగామ పట్టణ మాదిగ సంఘం ఆధ్వర్యంలో బుధవారం మెయిల్ ద్వారా వినతి చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశం కల్పిస్తామని మీనాక్షి నటరాజన్ ప్రకటించడం స్వాగతిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పట్టణ మాదిగ సంఘం అధ్యక్షుడు ఉడుగుల కిష్టయ్య, ప్రధాన కార్యదర్శి గాదెపాక రామచందర్, కోశాధికారి మల్లిగారి మధు, వ్యవసాయక మార్కెట్ డైరెక్టర్ బొట్ల నర్సింగరావు, జేరుపోతుల కుమార్, బొట్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో విద్యార్థికి బంగారు పతకం
జనగామ రూరల్: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పట్టణంలోని మైనారిటీ జూనియర్ కళాశాల బాలుర–1లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి కార్తీక్ బంగారు పతకం కై వసం చేసుకున్నాడు. ఈసందర్భంగా బుధవారం కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా విద్యార్థి కార్తీక్‌ను, పీడీ రాజుకు అభినందనలు తెలిపారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లా కొమ్ములవంచలో నిర్వహించిన రాష్ట్రస్థాయి 69వ ఎస్‌జీఎఫ్‌ఐ పోటీల్లో ప్రతిభ కనబర్చి బంగారు పతకం అందుకున్నాడు. అలాగే జిల్లా మైనారిటీ అధికారి విక్రంకుమార్, కళాశాల ప్రిన్సిపల్ అనిల్ బాబు అభినందించారు.