
పదేళ్లు
పోరాటాల ఖిల్లాకు
నేడు పదో వసంతంలోకి అడుగిడనున్న జిల్లా
● ప్రగతిపథంలో పయనిస్తున్న ఉద్యమాల గడ్డ
● ఆనాడు జిల్లా కోసం 500 రోజుల ఉద్యమం
● జైలు జీవితం గడిపిన 55 మంది ఉద్యమకారులు
● సోషల్ వాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేడుకలకు ఏర్పాట్లు
జనగామ: పోరాటాల పునాదులపై పురుడు పోసుకున్న జనగామ జిల్లా శనివారం(ఈనెల 11న) తొమ్మిది వసంతాల ప్రయాణం పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనంతరం ఏర్పడిన కొత్త జిల్లాల్లో, జనగామ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. జనగామ జిల్లా ఏర్పాటు చేస్తామని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినా.. జనగామ పేరు పునర్విభజన జిల్లాల జాబితాలో లేకపోవడంతో ఉద్యమ జ్వాల రగిలింది.
రెండేళ్ల పాటు నిరంతర పోరాటం
జిల్లా సాధన కోసం ప్రజలు ఏడాదికిపైగా నిద్రాహారాలు మానుకుని పోరుబా ట సాగించారు. 500 రోజుల ఉద్య మం సాగగా, 250 రోజుల రీలే దీక్షలు, 200రోజుల పాటు 144 సెక్షన్ నిర్బంధం కొనసాగింది. ఎగిసి పడ్డ ఉద్యమంతో ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. జిల్లా కోసం సాగిన పోరులో పోలీసుల ముందస్తు అరెస్టులు, జైళ్లకు తరలింపులు, నిరసనలు ఇవన్నీ నేటికీ ప్రజల జ్ఞాపకాలలో నిలిచిపోయాయి.
అగ్నిగుండంలా మారిన ఉద్యమం
నాటి ప్రభుత్వం జనగామను జిల్లాల జాబితాలో చేర్చాలంటూ జరిగిన ఉద్యమం ఒక్కసారిగా అగ్నిగుండంలా మారింది. వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రతిరోజూ జరిగే రాస్తారోకోలతో రవాణా వ్యవస్థ స్థంభించి పోయింది. ప్రభుత్వానికి నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు వెల్లువెత్తాయి. 12 గంటల పాటు సాగిన ఓ నిరసనలో ఆర్టీసీ బస్సు దహనం కావడంతో ఆందోళన తీవ్రరూపం దాల్చింది. ఈఘటనలో అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
పోరాట ఫలితం.. జిల్లా అవతరణ
సమాజంలోని అన్ని వర్గాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, రైతులంతా జనగామ జిల్లా కావాలనే స్వరం వినిపించారు. చివరకు ప్రజల డిమాండ్ ముందు ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. 2016 అక్టోబర్ 11న అధికారికంగా జనగామ జిల్లా ఆవిర్భావం చెందింది. నాటి ముహూర్తం నుంచి ఈ ప్రాంతం అభివృద్ధిలో వేగంగా అడుగులు వేస్తోంది.
అభివృద్ధి పథంలో..
ఇప్పటికే విద్య, వ్యవసాయం, పరిశ్రమలు, తదితర రంగాల్లో జిల్లా సరికొత్త శకం ప్రారంభించింది. జిల్లాకేంద్రం ఆధునిక సౌకర్యాలతో కళకళలాడుతోంది. కొట్లాడి తెచ్చుకున్న జిల్లాగా పేరుపొందిన జనగామ రాష్ట్రంలో అభివృద్ధి ప్రతీకగా నిలుస్తోంది. అయినప్పటికీ గత, ప్రస్తుత ప్రభుత్వ హామీలు అమలు కాకపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కోసం పోరాడిన అనేక మంది ఉద్యమకారులు సైతం నేటికీ కోర్టు కేసుల్లో తిరుగుతూ, ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురవుతూ ప్రభుత్వం నుంచి ఆదరణ లేక ఇబ్బందులు పడుతున్నారు.
నేడు ఆవిర్భావ దినోత్సవం
జిల్లా ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని సోషల్ వాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్‌ఎంఆర్ గార్డెన్‌లో జిల్లా 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకోనున్నారు. ఉదయం 10 గంటలకు వేడుకలను ప్రారంభించడం జరుగుతుందని జిల్లా జేఏసీ కన్వీనర్ మంగళ్లపల్లి రాజు తెలిపారు. ప్రజలు, ఉద్యమకారులు, అన్ని వర్గాల ప్రజల సహకారంతో జనగామ మరో మైలురాయిని చేరుకుంటుందన్నారు. జిల్లా ఉద్యమ చరిత్రను గుర్తు చేస్తూ ఉద్యమకారులు పలు డిమాండ్లు విడుదల చేశారు.

పదేళ్లు

పదేళ్లు