
కొనుగోళ్లకు సిద్ధం
జిల్లాలో కొనుగోలు కేంద్రాలు
మహిళా సంఘాలకు పెద్దపీట
అన్ని ఏర్పాట్లు చేపట్టాం
జనగామ రూరల్: వానాకాలం సీజన్‌కు సంబంధించి వరికోతలు ప్రారంభమయ్యాయి. ముందస్తు సాగు చేసిన వారు వారం నుంచే కోతలు ప్రారంభించారు. ఈనేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. జిల్లా వ్యాప్తంగా 309 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. కాగా ఇప్పటికే కలెక్టర్ ఆదేశాల మేరకు జనగామ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించగా ఈనెల 13 (సోమవారం) నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 2,13,978 ఎకరాల్లో వరి పంట సాగుకాగా.. 5,43,057 టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేస్తున్నారు. 2,05,057 టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సన్న రకానికి మద్దతు ధర రూ.2,389లు, బోనస్‌గా క్వింటాల్‌కు రూ.500, అలాగే దొడ్డు రకానికి రూ.2,369 మద్దతు ధర లభించనుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని పంట కొనుగోలుకు సంబంధించి డీఆర్డీఓ, డీసీఓ డీపీఎం, డీటీలు, జిల్లా, మండల, గ్రామ స్థాయి సెర్ప్ సిబ్బంది, కొనుగోలు కేంద్రాల కమిటీ సభ్యులతో ఇప్పటికే కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాలని అధికారులు నిర్ణయించారు. కొనుగోలు చేసిన ధాన్యంపై వచ్చే కమీషన్ నుంచి రైతులు తాగడానికి మంచినీరు, టెంట్, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలి. అలాగే ప్యాడీ సెంటర్లను శుభ్రంగా ఉండాలి. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ప్రతీరోజు ట్యాబ్ ఎంట్రీ చేయడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు.
రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు పంపించేలా ప్రణాళిక రూపొందించారు. ఈమేరకు అవసరాలకు అనుగుణంగా లారీలు, హమాలీలను సిద్ధం చేసుకుంటున్నారు. అదేవిధంగా కొనుగోళ్లకు సంబంధించి ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో వెంటనే జమ అయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
గత రెండు సీజన్‌లలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ఈసారి కూడా పక్కా ప్రణాళికతో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరగాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులను అదేశించారు. వానాకాలం పంట కొనుగోలుపై ఆర్డీఓ, సివిల్ సప్ప్లై, డీఆర్డీఓ, మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, జిల్లా, మండల, గ్రామ స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు, ఆర్టీఓ, గన్నీ గోదాం ఇన్‌చార్జ్‌లు, రైస్ మిల్లర్ల అసోసియేషన్లు అందరూ సమన్వయంతో పనిచేస్తే కొనుగోళ్లు సజావుగా సాగుతాయి. ప్రతి కేంద్రంలో కొనుగోలుకు సంబంధించిన రిజిస్టర్‌లు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీన ర్లు, వేయింగ్ యంత్రాలు, టార్ఫాలిన్ మొదలగు వసతులు ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది.
జిల్లాలో 309 కేంద్రాల ఏర్పాటు
సన్నరకం, దొడ్డు రకం వేర్వేరుగా కొనుగోలు
ఇప్పటికే జిల్లాలో ప్రారంభమైన
కొనుగోలు కేంద్రాలు
కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించేలా ప్రణాళిక
జిల్లాలో ఏర్పాటు చేస్తున్న 309 కొనుగోలు కేంద్రాల్లో మహిళా సంఘాలకే పెద్దపీట వేశారు. ఐకేపీ, పీఏసీఎస్, రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయనున్నారు. కేంద్రాల్లో ఎప్పటికప్పు డు ధాన్యం సేకరణ వివరాలను వ్యవసాయశాఖ సేకరించాలి. ధాన్యం పూర్తి వివరాలు ప్రతీరోజు నమోదు చేయాలి. కొనుగోలు రవాణా, డ్రై మిషన్, ప్యాడీ క్లీనర్స్, వేయింగ్ మిషన్లు, తేమ శాతం, ఆటోమెటిక్ జాలి మిషన్లు, ముందస్తుగా సిద్ధంగా ఉంచుకోవాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలు వచ్చాయి. సివిల్ సప్లై శాఖ ద్వారా కేంద్రాల్లో గన్నీసంచులు సిద్ధం చేసుకుంటున్నారు.
దొడ్డు రకం కొనుగోలు కేంద్రాలు –198
ఐకేపీ – 116
పీఏసీఎస్‌లు – 82
సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రాలు – 101
ఐకేపీ – 69
పీఏసీఎస్‌లు – 42
మొత్తం కేంద్రాలు – 309
జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అన్ని చర్యలు చేపట్టాం. జిల్లా వ్యాప్తంగా 309 సెంటర్లను ఎంపిక చేశాం. కేంద్రాల వద్ద టోల్ ఫ్రీ నెంబర్‌ను ప్రదర్శిస్తాం. అవసరమైన మేర గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. ధాన్యం నాణ్యత ప్రమాణాలపై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలి. తేమ శాతం చూసుకొని నాణ్యమైన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి.
– అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్

కొనుగోళ్లకు సిద్ధం