
కల్యాణం..కమనీయం
కనులపండువగా
శ్రీలక్ష్మీనర్సింహస్వామి
వివాహా మహోత్సవం
● వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో
తరలివచ్చిన భక్తులు
● సాయంత్రం గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు
జఫర్‌గఢ్ : మండల కేంద్రంలో శ్రీవేల్పుగొండ శ్రీ లక్ష్మీనర్సింహ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీలక్ష్మీనర్సింహస్వామి కల్యాణమహోత్సవం ఆదివారం కన్నులపండువగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు స్వామివారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలుత వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవ విగ్రహాలను అలంకరించారు. అనంతరం భక్తుల సమక్షంలో స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఈ కల్యాణమహోత్సవాన్ని భక్తులు కనులార తిలకించి భక్తి పారవశ్యంతో మునిగిపోయారు. ఈ వేడుకలను తిలకించిన అనంతరం భక్తులు స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి మొక్కులను సమర్పించారు. ఈసందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం సమయంలో గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. మంగళవాయిద్యాలు, ఆటపాటలు, మహిళల కోలాటాల నృత్యాల మధ్య పలు పురవీధుల గుండా స్వామి వారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు వెంకటాచా ర్యులు, శ్రీనివాసచార్యులు, కృష్ణమాచార్యులతో పాటు భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాగా చివరి రోజు శాంతిహోమం, మహాపూర్ణాహుతి, చక్రస్నానం తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.