
రైతు కుటుంబానికి న్యాయం చేయాలి
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని పాంనూర్ గ్రామంలో వ్యవసాయ భూమి వద్ద విద్యుదాఘాతంతో శనివారం మృతిచెందిన రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మృతుడి కుటుంబసభ్యులు, గ్రామస్తులు, బంధువులు ఆదివారం ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన, జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. పాంనూర్ గ్రామానికి చెందిన కోట వాసు అనే రైతు వ్యవసాయ పనుల నిమిత్తం శనివారం తన వ్యవసాయభూమి వద్దకు వెళ్లి పొలంలో తెగి పడి ఉన్న విద్యుత్ ఎల్‌టీ లైన్ తీగతో విద్యుదాఘాతంతో మృతిచెందిన సంగతి తెలిసిందే. కాగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే వాసు మృతిచెందాడని ఆరోపిస్తూ మృతుడి భార్య, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆదివారం స్టేషన్‌ఘన్‌పూర్ విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం సబ్‌స్టేషన్ ఎదుట ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. రైతు కుటుంబానికి న్యాయం చేయాలని, విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినదించారు. దాదాపు మూడు గంటల పాటు రాస్తారోకో చేపట్టడంతో జాతీయ రహదారిపై ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. రైతు కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా సంబంధిత అధికారులు రాకపోవడం గమనార్హం. కాగా విషయం తెలుసుకున్న ఏసీపీ భీమ్‌శర్మ, సీఐ జి.వేణు, ఎస్‌ఐలు వినయ్‌కుమార్, రాజేశ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబీకులకు, గ్రామస్తులకు నచ్చజెప్పారు. వారు ససేమిరా వినకపోవడంతో విద్యుత్‌శాఖ అధికారులతో ఫోన్‌తో మాట్లాడించారు. మృతిచెందిన రైతు కుటుంబానికి విద్యుత్‌శాఖ నుంచి న్యాయం చేస్తామని, ఏమైనా ఉంటే వారిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సర్దిచెప్పడంతో ఎట్టకేలకు రాస్తారోకో విరమించారు. ఈ సందర్భంగా రైతు కుటుంబ సభ్యులు, పాంనూర్ గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రైతు వాసు మృతిచెందాడని ఆరోపించారు. గతంలో పలుమార్లు విద్యుత్ తీగల సమస్యపై ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రాస్తారోకో చేస్తున్న వారితో మాట్లాడుతున్న ఏసీపీ భీమ్‌శర్మ
జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతు బంధువులు, గ్రామస్తులు
స్టేషన్ ఘన్‌పూర్‌లో కుటుంబసభ్యులు,
గ్రామస్తుల రాస్తారోకో
విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోనే చనిపోయాడని ఆరోపిస్తూ ఆందోళన

రైతు కుటుంబానికి న్యాయం చేయాలి