
చెదిరిన కల
జనగామ: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయడంతో అభ్యర్థిత్వం కోసం సిద్ధమైన నేతల్లో నిరాశ అలుముకుంది. గత కొన్ని వారాలుగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ల హడావిడి అంతా ఇంతా కాదు. రిజర్వేషన్లు అనుకూలంగా రావడంతో సంతోషంగా ఉన్న నాయకులు ఒక్కసారిగా గందరగోళంలో పడ్డారు. ఈసారి రిజర్వేషన్‌న్‌అనుకూలంగా వచ్చిందని ఆనందపడ్డ నాయకులు, ఇప్పుడు పాత రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయేమోనని ఆందోళనలో ఉన్నారు. హైకోర్టు ఇచ్చిన స్టేతో ఎన్నికల షెడ్యూల్ నిలిచిపోగా, గ్రామీణ రాజకీయంలో నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. రిజర్వేషన్లు అనుకూలంగా రావడం, అధిష్టానం ఆశీస్సులు ఇస్తుందనే బలమైన నమ్మకంతో గ్రామాల్లో పర్యటనలు చేసి, తమ అనుచర వర్గం మద్దతు కూడగట్టుకున్నారు. ఎన్నికల పోలింగ్ వరకు వెంట నడిచే పార్టీ వర్గాలు చేజారిపోకుండా దసరా పండగ సమయంలో ఎంతోకొంత మొత్తంలో ఖర్చులు పెట్టేశారు. దీంతో అప్పులు చేసి ఖర్చుచేసిన వారికి ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి.
ఎదురుచూపులే..
స్థానిక ఎన్నికలకు సంబంధించి నాలుగు వారాల లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఆశావహులు అప్పటివరకు ఆగాల్సిందే. రిజర్వేషన్లు కలిసి వచ్చి అభ్యర్థిత్వం కోసం ఆశపడ్డ వందలాది మంది నాయకులు ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చే వరకు ఎదురుచూద్దామనే ఆలోచనలో ఉన్నారు. కొత్త రిజర్వేషన్ల ప్రకారం కొందరికి అవకాశం దొరికినా.. తప్పని పరిస్థితుల్లో పాత వాటితో ముందుకు వెళ్తే అవకాశాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మొదటి విడత జరగాల్సిన లింగాలఘనపురం, దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల, స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు మండలాల్లో రాజకీయ హడావిడి గప్‌చుప్‌గా మారిపోయింది. ఆరు మండలాల్లో కొత్త రిజర్వేషన్లతో అభ్యర్థులు పోటీకి సన్నద్ధ మవుతున్న సమయంలో కోర్టు తీర్పు సందిగ్ధంలో పడేసింది. రాబోయే రోజుల్లో హైకోర్టు తీర్పు ఆధారంగా ఎన్నికల భవిష్యత్తు నిర్ణయించబడనుంది. మొత్తానికి హైకోర్టు స్టే స్థానిక రాజకీయాలను కుదిపివేస్తుండగా, ఎన్నికల సమీకరణాలు మారే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల్లో ఇదే చర్చ జరుగుతోంది.
స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టేతో ఆశావహుల షాక్
మరికొన్ని రోజుల పాటు ఎదురుచూపులే..