
నూతన భవనంలోకి పాఠశాల తరలింపు
పాలకుర్తి టౌన్: మండలంలోని ఎల్లారాయిని తొర్రూరు ప్రాథమిక పాఠశాలలో హైస్కూల్, ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం నిర్వహిస్తున్నారు. సాక్షి దినపత్రికలో ‘ఆరు గదులు..మూడు బడులు’ పేరిట ప్రచురితమైన కథనానికి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా స్పందించి పాఠశాల హెచ్‌ఎం పెనుగొండ రమేశ్‌ను నూతన భవనంలోకి తరలించాలని అదేశించారు. అయినప్పటికీ నూతన భవనవంలోకి విద్యార్థులను తరలించకపోవడంతో బుధవారం ప్రధానోపాధ్యాయుడు రమేశ్‌పై కలెక్టర్ సీరియస్ కావడంతో పాటు విద్యాశాఖ జిల్లా ఏఎస్‌ఓగా కొనసాగుతున్న ఆయన డిప్యుటేషన్‌ను రద్దు చేశారు. గురువారం ఉదయం 10గంటల వరకు విద్యార్థులను నూతన భవనంలోకి తరలించకుంటే సస్పెండ్ చేస్తానని ప్రధానోపాధ్యాయుడు రమేశ్‌ను కలెక్టర్ హెచ్చరించడంతో విద్యార్థులతో పాటు సామగ్రిని తరలించారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ సత్యమూర్తి, ఎంఈఓ పోతుగంటి నర్సయ్య పాఠశాల నూతన భవనంలో ఏర్పాట్లను పరిశీలించారు. గత ప్రభుత్వంలో రూ.50 లక్షలతో గ్రామానికి దూరంగా నూతన పాఠశాల భవనం నిర్మించారు. కాగా ఈ భవనవంలోకి విద్యార్థులను తరలించడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

నూతన భవనంలోకి పాఠశాల తరలింపు