
అతివల ఆరోగ్యానికి నవశకం
జనగామ: మహిళల ఆరోగ్య సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పథకం స్వస్థా నారీ సశక్త్ పరివార్ అభియాన్. బుధవారం(నేటి) నుంచి సేవలు అందుబాటులో రానున్నాయి. వచ్చేనెల 2 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించనున్నారు. మారుతున్న జీవనశైలి, వాతావరణ ప్రభావాలతో మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సవాళ్లను అధిగమించడమే లక్ష్యంగా ఈ ప్రోగ్రాం ముందుకుసాగనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకంలో శిబిరాలను ఏర్పాట్లు చేస్తున్నారు.
విప్ చేతుల మీదుగా..
జనగామ చంపక్‌హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య చేతుల మీదుగా స్వస్థానారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వచ్చే నెల 2వ తేదీ చివరి రోజు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు.
ప్రత్యేక వైద్య సేవలు ఇవే..
స్వస్థానారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రోగ్రాంలో నేత్ర, దంత, చెవి, ముక్కు, గొంతు, ప్రసూతి, మానసిక ఆరోగ్య, బీపీ, షుగర్, క్యాన్సర్, టీబీ, రక్తహీనత వంటి వైద్య పరీక్షలు చేస్తారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రత్యేక వైద్య పరీక్షల ద్వారా రోగనిర్ధాణ చేసి, అవసరమైన మందులను ఉచితంగా అక్కడే అందిస్తారు. 0–5 సంవత్సరాల చిన్నారులకు టీకాలు సైతం వేస్తారు. జిల్లాలోని 12 మండలాల పరిధిలో 15 ఆరోగ్య, 3 సామాజిక, 62 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు ఉండగా, రోజువారీగా 1,300వరకు ఓపీ సేవలు ఉంటాయి. అలాగే బస్తీ దవాఖానాలు, జనరల్ ఆసుపత్రుల్లో సైతం ఉచిత వైద్యం కొనసాగుతుంది.
ప్రతిరోజూ 6 వైద్య శిబిరాలు..
ప్రతిరోజూ జిల్లాలో ఆరు వైద్య శిబిరాలు నిర్వహిస్తాం. మహిళలతో పాటు చిన్నారులకు కూడా పరీక్షలు చేస్తారు. పౌష్టికాహార లోపాలు గల చిన్నారులను న్యూట్రీషన్ రిహాబిలిటేషన్ సెంటర్‌కు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేస్తాం. ఈ కార్యక్రమాన్ని ప్రతీ మహిళ, కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి పిల్లలు సద్వినియోగం చేసుకోవాలి.
నేడు ప్రభుత్వ విప్ బీర్ల చేతుల మీదుగా
స్వస్థానారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభం
ఎంసీహెచ్‌లో ఏర్పాట్లు పూర్తిచేసిన
వైద్య ఆరోగ్య శాఖ
చిన్నారుల నుంచి వృద్ధుల వరకు
వైద్యపరీక్షలు, మందులు

అతివల ఆరోగ్యానికి నవశకం