
1నుంచి 10వ తరగతి విద్యార్థులకు పంపిణీ
వారానికి మూడు రోజులు..
మంచి నిర్ణయం..
జనగామ: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 1 (సోమవారం) నుంచి రాగి జావ పథకం ప్రారంభం కానుంది. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 10 తరగతుల విద్యార్థుల పోషకాహారాన్ని (ప్రధానమంత్రి పోషణ్) మరింత బలోపేతం చేయడానికి పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ సహకారంతో రాగిజావ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్యాక్ చేసిన రాగి, బెల్లం పొడి ప్యాకెట్లను మండల స్థాయికి పంపిస్తారు. అక్కడి నుంచి ఎంఈ వోల పర్యవేక్షణలో పాఠశాలలకు రవాణా చేస్తారు. ఇందుకు సంబంధించి మధ్యాహ్న భోజనం వడ్డించే కుక్, హెల్పర్లకు రాగిజావ వడ్డించినందుకు గాను ఒక్కో విద్యార్థికి 25 పైసల చొప్పున చెల్లించనున్నారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్న త, ప్రభుత్వ పాఠశాలలు 545 ఉండగా, సుమారు 31వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
రాగిజావ ఇలా..
ప్రతీ విద్యార్థికి రోజుకు 10 గ్రాముల రాగిపిండి, 10 గ్రాముల బెల్లం పొడి కలిపి అందిస్తారు. మధ్యాహ్న భోజనంలో గుడ్లు ఇవ్వని రోజు వారానికి మూడుసార్లు రాగి జావ వడ్డించాలి. రాగి జావ తయారీ కోసం సురక్షితమైన తాగునీటిని మాత్రమే ఉపయోగించాలి. స్వచ్ఛతతో కూడిన కిచెన్‌న్ షెడ్‌తో పాటు గాలి, వెలుతురు సమపాళ్లలో ఉండేలా హెచ్‌ఎంలు చూసుకోవాలి. వంట తయారుచేసే గ్రూపులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు తలకు కవర్, మాస్క్ ధరించి, చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలి. పాత్రలు, వంటగది, భోజనశాలను ప్రతి రోజు శుభ్రం చేయాలని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. రాగిజావ పంపిణీ చేసే సమయంలో ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణ చేస్తూ ప్రతి పిల్లవాడికి సమానంగా వడ్డించేలా చూడాలి. రాగి జావ తయారుచేసేందుకు అవసరమైన ఇంధన ఖర్చుల కోసం ప్రతీ విద్యార్థికి రోజుకు 25 పైసల చొప్పున ప్రభుత్వం వారికి చెల్లించనుంది. ప్రతీనెల రాగిజావ కోసం పాఠశాల వారీగా నివేదికలను ఎంఈవోలు అందించాల్సి ఉంటుంది. రాగి జావతో విద్యార్థుల ఆరోగ్యం, పోషణ మెరుగుపడడంతో పాటు మధ్యాహ్న భోజన పథకం మరింత సమర్థవంతంగా అమలవుతుందని విద్యాశాఖ ముఖ్య ఉద్దేశ్యం.
పిల్లలకు పోషకాహారం అందించడమే లక్ష్యం
జిల్లాలో 545 ప్రభుత్వ బడుల్లో అమలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ రిజ్వాన్ బాషా పర్యవేక్షణలో సర్కారు బడుల్లో నేటి నుంచి వారానికి మూడు రోజుల పాటు విద్యార్థులకు రాగి జావ అందించనున్నాం. ప్రభుత్వం రాగి, బెల్లం పొడి ప్యాకెట్లను పంపిస్తుండగా, ఎంఈవోల ద్వారా పాఠశాలలకు వాటిని సప్లయ్ చేస్తాం. ఈ పథకం విజయవంతంగా అమలు చేసేందుకు నిత్యం పర్యవేక్షిస్తాం.
– బొమ్మనబోయిన శ్రీనివాస్, ఏఎంఓ
సర్కారు బడులకు వచ్చే విద్యార్థులకు ప్రభుత్వ రా గిజావ అందించడం మంచి నిర్ణయం. రాగిజావతో పిల్లల ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగు పడడమే కాకుండా దృఢంగా తయారవుతారు. దీంతో చదువుతో పాటు ఆటల్లో మరింత రాణిస్తారు.
– రావుల రామ్మోహన్‌రెడ్డి,
ప్రభుత్వ ఉపాధ్యాయుడు