
మహిళాశక్తి మరింతగా!
● మహిళా సంఘాల బలోపేతంపై ప్రభుత్వం దృష్టి
● వృద్ధులు, దివ్యాంగులు,కిశోర బాలికలతో గ్రూపుల ఏర్పాటు
● బ్యాంక్ నుంచి లింకేజీ రుణాలు ఇచ్చేలా చర్యలు
● యాక్షన్ ప్లాన్ తయారుచేస్తున్న అధికారులు
● జిల్లావ్యాప్తంగా 1,29,179 మంది సభ్యులు
జనగామ రూరల్: మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. మహిళా సంఘాలను బలోపేతం చేసి ఆర్థిక సాధికారత సాధించాలన్న లక్ష్యంతో ఇందిర మహిళాశక్తి పథకాన్ని తీసుకొచ్చారు. ఈనేపథ్యంలో వృద్ధులు, దివ్యాంగులు, కిశోర బాలికలకు కొత్తగా మహిళ సంఘ గ్రూపులు ఏర్పాటు చేసి అర్హులైన వారందరికీ బ్యాంక్ రుణాలు అందించేలా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లోని వృద్ధులు, బాలికలు, దివ్యాంగులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గతంలో మహిళా సంఘాలను ఏర్పాటు చేసినప్పుడు 60 ఏళ్లు దాటితే వారిని గ్రూపులోంచి తొలగించారు. ప్రస్తుతం ఉన్నవారిని అలాగే ఉంచాలని, లేకుంటే వారికి ఒక ప్రత్యేక గ్రూపు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు.
వృద్ధులు, దివ్యాంగుల ఆనందం..
గతంలో 60 ఏళ్లు దాటాయంటే మహిళలను గ్రూపు నుంచి తొలగించారు. దీంతో వారు పొదుపు చేసుకునే అవకాశం కోల్పోయారు. ప్రభుత్వం అందించే పథకాలు వర్తించేవి కాదు. వృద్ధులు కావడంతో వారికి బ్యాంక్ రుణాలు ఇవ్వలేమని అప్పుడు తిరస్కరించేవారు. తాజాగా ప్రభుత్వం కచ్చితంగా వృద్ధులకు గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు అందించాలని ఆదేశించడంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ మహిళాసంఘాల ఆధ్వర్యంలో కొత్తగా ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేసి వారికి ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. వీరితోపాటు 15 నుంచి 18 ఏళ్ల వయస్సున్న బాలికలతో కూడా సంఘాలను ఏర్పాటు చేసి వారికీ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. వీరితోపాటు, సామాజిక మాధ్యమాల మోసాలు, అత్యాచారాలు, ఇతరత్రా అంశాలపై వారికి చైతన్యం కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈసారి ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక గ్రామంలో 12 మంది ఉంటే వారికి ఒక గ్రూపు ఏర్పాటు చేయనున్నారు. లేకుంటే వేరే సంఘాల్లో ఉంటారు. వీరందరికీ బ్యాంక్ రుణాలు అందించి వారిని ఆర్థిక సాధికారత సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రత్యేక కార్యాచరణతో రుణాల అందజేత
ఈనెల 12 నుంచి 14వరకు గ్రామాల వారీగా జాబితా రూపొందించి మహిళా సంఘాల్లో లేని మహిళలు, దివ్యాంగులు, బాలికలను గుర్తిస్తారు. 14 నుంచి 15 వరకు వారికి సంఘాల్లో చేరితే కలిగే ప్రయోజనం గురించి వివరించనున్నారు. బ్యాంక్ రుణాలు అందుతాయని చెప్పి వారిని గ్రూపులో చేర్పించేలా చూస్తారు. 15 నుంచి 30 వరకు సంఘాల్లో చేరిన సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి బ్యాంకుల్లో ఖాతాలను ఓపెన్ చేసి రుణాలు అందిస్తారు. వీరికి సంబంధించిన వివరాలన్నింటినీ సెర్చ్ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. బ్యాంక్ లింకేజీ, సీ్త్రనిధి రుణాలు సైతం మంజూరు చేయనున్నారు. రీవాల్వింగ్ ఫండ్‌ను ఖాతాల్లో జమచేస్తారు.
మండలం గ్రూపులు మొత్తం సభ్యులు
బచ్చన్నపేట 1048 12,182
చిల్పూర్ 906 10,019
దేవరుప్పుల 1030 11,852
ఘన్‌పూర్(స్టే) 1128 13,067
జనగామ 981 11,402
కొడకండ్ల 694 8,563
లి.ఘణపురం 984 10,943
నర్మెట 566 6,602
పాలకుర్తి 1306 14,335
రఘునాథపల్లి 1275 14,588
తరిగొప్పుల 480 5,539
జఫర్‌ఘడ్ 857 9,887
మొత్తం 11,255 1,29,179
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళలు సాధికారత సాధించాలన్న ఉద్దేశంతో కొత్తగా మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో నూతనంగా వృద్ధులు, దివ్యాంగులకు, బాలికలతో గ్రూపులు ఏర్పాటు చేయనున్నాం. ఇప్పటికే అవగాహన కల్పిస్తున్నాం. వీరికి బ్యాంకు నుంచి లింకేజీ రుణాలు అందిస్తాం.
– వసంత, డీఆర్‌డీఓ, జనగామ

మహిళాశక్తి మరింతగా!

మహిళాశక్తి మరింతగా!

మహిళాశక్తి మరింతగా!