
కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
లింగాలఘణపురం: విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్‌త్ ఉంటుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శనివారం మండలంలోని నెల్లుట్ల పాఠశాలలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. పదో తరగతి, ప్రీప్రైమరీ విద్యార్థులతో మాట్లాడారు.. ప్రైమరీ విద్యార్థులతో బోర్డుపై ఉన్న పదాలను చదివించి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ప్రణాళికబద్ధంగా చదువుకోవాలని, అప్పుడే మంచి మార్కులు సాధిస్తారని పదో తరగతి విద్యార్థులకు సూచించారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉందో పరిశీలించి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అనే విషయాలను తెలుసుకున్నారు. హెడ్మాస్టర్లు రవీందర్, సమ్మక్క తదితరులు ఉన్నారు.