
నేడు రక్షా బంధన్
● వృద్ధాప్యంలోనూ ప్రేమానుబంధాన్ని చాటుతున్న అక్కాచెల్లెళ్లు
● ఎక్కడున్నా.. రాఖీ పౌర్ణమికి సోదరుల ఎదురుచూపులు
అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని పంచి పెంచే పండుగ రక్షాబంధన్. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున కులమతాలకతీతంగా ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. రాఖీ అంటే దారం కాదు.. అది ఒక రక్షణ కవచం, బంధాలను గుర్తుచేసే సందర్భం. సోదరుడి మణికట్టుకు సోదరి కట్టే రాఖీ అనురాగాలు, ఆప్యాయతకు ప్రతీకగా నిలుస్తోంది. వృద్ధాప్యం మీద పడినా.. ఏ పరిస్థితుల్లో ఉన్నా తన తమ్ముడికి, అన్నకు రాఖీ కట్టే అక్కలు, చెల్లెళ్లు ఎందరో ఉన్నారు. ప్రేమను పంచుతున్న అలాంటివారిపై నేడు రాఖీ పౌర్ణమి (రక్షా బంధన్) సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
బంధాలకు విలువనివ్వాలి..
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ పట్టణానికి చెందిన 82 ఏళ్ల వయసుగల తాటిపాముల నరసింహమూర్తికి 65 ఏళ్ల చెల్లెలు గుడి విజయలక్ష్మి ప్రతి ఏడాది రాఖీ కడుతుంది. ఆత్మీయత, అనురాగాలకు ప్రతీకగా రాఖీ పండుగ ఉంటుందని అన్నాచెల్లెళ్లు పేర్కొంటున్నారు. ప్రతిఒక్కరూ బంధాలు, బంధుత్వాలకు విలువ ఇవ్వాలని వారు కోరారు. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ఆ సంతోషం ఎన్నటికీ మరిచిపోలేనిదని వారు తెలిపారు.
45 ఏళ్లుగా రాఖీ కడుతున్న చెల్లెలు
బచ్చన్నపేట: మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి రాజయ్య, కాశీపతి, మురళి, ఊర్మిల అన్నాచెల్లెలు. ముగ్గురు అన్నలకు చిన్నారి చెల్లె ఊర్మిల. ఈమె వివాహం 1980లో జగదేవపూర్‌కు చెందిన వ్యక్తితో జరిపించారు. వారు అప్పటి నుంచి వ్యాపార నిమిత్తం సిద్దిపేటలో ఉంటున్నారు. 45 సంవత్సరాలుగా ఊర్మిల బచ్చన్నపేటకు వచ్చి అన్నలు కొత్తపల్లి రాజయ్య, కాశీపతి, మురళికి తప్పకుండా రాఖీ కడుతోంది. అన్నలు ఇచ్చే కట్న కానుకలను సంతోషంగా స్వీకరిస్తుంది. ప్రతీ సంవత్సరం ముగ్గురు అన్నలు చెల్లె ఊర్మిల వచ్చే వరకు ఎదురు చూస్తుంటారు.

నేడు రక్షా బంధన్

నేడు రక్షా బంధన్