
దంచికొట్టిన వాన
జనగామ: జిల్లాలో గురువారం రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు వర్షం దంచికొట్టింది. మరో రెండురోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. ఈ నెల 8 నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు జిల్లాలో 60.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వరి, పత్తి, మొక్కజొన్న, తదితర ఆరుతడి పంటలకు ఈ వర్షం ప్రాణం పోయగా... చెరువులు, వాగులకు వరద నీరు వచ్చే పరిస్థితి కనిపించలేదు. వర్షాభావ పరిస్థితుల్లో 10 మీటర్ల లోతుకు పడిపోయిన భూగర్భ జలాలు.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కొంతమేర మెరుగు పడే అవకాశం ఉంది. వర్షాలు ఇలాగే కురిస్తే ఆయా మండలాల పరిధిలోని కల్వర్టులు, తాత్కాలికంగా ఏర్పా టు చేసిన రోడ్లు, వాగులు, వంతెనలకు సంబంధించి రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగే అవకాశం ఉన్న నేపధ్యంలో అధికార యంత్రాంగం ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. జనగామ–నర్మెట ప్రధాన రహదారి గానుగుపహాడ్ బ్రిడ్జి అసంపూర్తి నిర్మాణంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాదకరంగా మారిపోతుంది.
జనగామ కాలనీలకు వరద ముప్పు
రెండురోజుల క్రితం కురిసిన వర్షంతో జనగామ పట్టణంలోని అనేక కాలనీలు వరద ప్రవాహంతో ముంపుకు గురయ్యాయి. వినాయకనగర్, జ్యోతినగర్ సెయింట్ మెరీస్ స్కూల్ వెనకాల, నెహ్రూపార్కు 60 ఫీట్ల రోడ్డు, శ్రీ విల్లాస్ కాలనీ వెనక కాలనీ, బాలాజీనగర్(పలు ప్రాంతాలు), కుర్మవాడ తదితర వార్డుల పరిధిలో రోడ్లన్నీ జలమయంగా మారాయి. మట్టిరోడ్లు బురదమయంగా మారి కాలినడకన వెళ్లలేకుండా జారుడు బండ మాదిరిగా మారిపోయా యి. రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు. పురపాలిక అధికారులు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారని పలు కాలనీల ప్రజలు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో మురికి కాల్వల నుంచి వచ్చే దుర్వాసనతో ప్రజలకు ఉచి తంగా రోగాలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది.
జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు
మండలం వర్షపాతం(మి.మీ)
దేవరుప్పుల 109.5
జనగామ 95.3
లింగాలఘణపురం 90.8
కొడకండ్ల 82.8
చిల్పూరు 76.8
బచ్చన్నపేట 68.8
రఘునాథపల్లి 67.8
స్టేషన్‌ఘన్‌పూర్ 62.3
తరిగొప్పుల 61.5
పాలకుర్తి 60.5
నర్మెట 52.8
జఫర్‌గఢ్ 37.3
జిల్లాలో 60.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
కాలనీలకు వరద ముప్పు
అవస్థల్లో పట్టణ ప్రజలు
కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్ నంబర్ 9052308621
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్..
జిల్లా వ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల సమయంలో ప్రజలకు సేవలు అందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ (9052308621) ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారీ వర్షాలతో వరదలు, ఇళ్లకు నష్టం, రహదారులు ధ్వంసం, చెట్లు కూలిపోవడం వంటి విపత్కర పరిస్థితులు ఎదురైన సందర్భంలో వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలాని, ఇది 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందన్నారు.

దంచికొట్టిన వాన

దంచికొట్టిన వాన