
ఊయలలో వదిలేయండి
జనగామ: పసిబిడ్డలను ఎక్కడ పడితే అక్కడ వదిలేయకండి..వద్దనుకుంటే ఎంసీహెచ్‌లో ఏర్పాటు చేసి న ఊయలలో వేసి వెళ్లండి.. వివరాలను గోప్యంగా ఉంచుతాం.. భూమిపై ప్రతీ జీవికి జీవించే హక్కు ఉందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. చంపక్‌హిల్స్‌లోని ఎంసీహెచ్‌లో చికిత్స పొందుతున్న అనాథ మగశిశువు ఆరోగ్య పరిస్థితిని కలెక్టర్ రిజ్వాన్‌బాషా–డాక్టర్ సయ్యద్ అమ్రిన్ దంపతులు శుక్రవారం రాత్రి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ మాసాలు మోసి కన్నబిడ్డలను ఎక్కడ పడితే అక్కడ వదలడం సమంజసం కాదన్నారు. శిశువులను ఊయలలో వేసి వదిలేసినా, ప్రభుత్వం వారికి ఉజ్వల భవిష్యత్‌ను అందిస్తుందన్నారు. ఎవరైనా తమ పిల్లల్ని అప్పగించాల్సిన పరిస్థితి ఉన్న సమయంలో చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (డీసీపీయూ)ని సంప్రదించాలన్నారు. చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్–1098 లేదా చట్ట బద్ధమైన దత్తత ప్రక్రియను అనుసరించవచ్చన్నారు. కలెక్టర్ వెంట డీడబ్ల్యూఓ డి.ఫ్లోరెన్స్, డాక్టర్ యశ్వంత్, డాక్టర్ నీలిమ, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రవికాంత్, చైల్డ్ హెల్ప్‌లైన్ (1098) ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ రవికుమార్ తదితరులు ఉన్నారు.
చదువుతోనే ఉజ్వల భవిష్యత్
జనగామ రూరల్: చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివా రం మండలంలోని పెంబర్తి మహాత్మా జ్యోతి రావు పూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థినులకు ఎక్కువ సమయం కేటాయించి ఏ సబ్జెక్ట్‌లో వెనుకబడి ఉన్నారో తెలుసుకొని అందుకు అనుగుణంగా ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. అనంతరం ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్, కిచెన్‌లో ఉండే వంట సరుకులను పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భోజన్న, డీసీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
కలెక్టర్ రిజ్వాన్ బాషా