ప్రభుత్వ కళాశాలల్లో నిఘా | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కళాశాలల్లో నిఘా

Jul 22 2025 7:54 AM | Updated on Jul 22 2025 8:08 AM

ప్రభు

ప్రభుత్వ కళాశాలల్లో నిఘా

విద్యారణ్యపురి: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇక నుంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగనుంది. అందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జూనియర్‌ కళాశాలల్లోని తరగతి గదులు, ల్యాబ్‌లు, స్టాఫ్‌ గది, ప్రిన్సిపాల్‌ గది, వరండా, కళాశాల ప్రాంగణంలో సీసీ కెమెరాలు బిగించారు. ఒక్కో కళాశాలలో 14 నుంచి 16 వరకు, అవసరమైన చోట 20వరకు సీసీ కెమెరాలు అమర్చారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని జూనియర్‌ కళాశాలల్లో సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ నిరంతరం కొనసాగనుంది.

విద్యాబోధనపై నిరంతర పర్యవేక్షణ

గతంలో కేవలం ఇంటర్మీడియట్‌ పరీక్షల సమయంలో మాత్రమే పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేవారు. ఆ తరువాత వాటిని తీసివేసేవారు. ఈ విద్యా సంవత్సరం 2025 – 2026 నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రధానంగా విద్యార్థుల హాజరు, అధ్యాపకుల విద్యాబోధనపై నిరంతర పర్యవేక్షణ కొనసాగనుంది. ప్రతీ తరగతి గదిలో నిఘా ఉంటుంది. అకడమిక్‌ మానిటరింగ్‌ కమిటీలు, డీఐఈఓలతో పాటు హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డులో కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా సంబంధిత అధికారులు పర్యవేక్షించనున్నారు.

విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా..

గతంలో ప్రభుత్వ కళాశాలలకు విద్యార్థులు తమ ఇష్టానుసారంగా వచ్చి వెళ్లిపోయేవారు. దాంతో హాజరు శాతం తక్కువగా ఉండడంతో పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం కూడా తక్కువగా ఉండేది. ఈ క్రమంలో సరైన విద్యాబోధన, పరీక్షల ఫలితాలు మెరుగుపడేలా ఉన్నతాధికారులు ఇంటర్‌లో పలు సంస్కరణలు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా తాజాగా సీసీ కెమెరాల ఏర్పాటుతో విద్యార్థుల హాజరు శాతం పెరిగే అవకాశం ఉంది. ఇకనుంచి అధ్యాపకులు కూడా సక్రమంగా విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. ఒక సబ్జెక్టు అధ్యాపకుడు ఒకరోజు రాకుంటే ఆ పీరియడ్‌లో వేరే అధ్యాపకుడు విద్యాబోధన చేయాల్సిన అవసరం ఉంటుంది.

ఫిజిక్స్‌వాలా శిక్షణపై..

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈనెల 15వ తేదీ నుంచి ఫిజిక్స్‌వాలా ద్వారా సంబంధిత వెబ్‌సైట్‌ ద్వారా జేఈఈ, ఐఐటీ, ఎప్‌సెట్‌, నీట్‌లాంటి ఎంట్రన్స్‌ పరీక్షల కోసం ఇంటర్‌ విద్యార్థులకు శిక్షణ ప్రక్రియ ప్రారంభమైంది. అందుకోసం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు ఫిజిక్స్‌వాలా శిక్షణకు సంబంధించిన టైంటేబుల్‌ను డీఐఈఓల ద్వారా ఆయా జిల్లాల కళాశాలల ప్రిన్సిపాళ్లకు అందించారు. ప్రతిరోజూ ఏదో ఒక సబ్జెక్టుపై శిక్షణ ఇవ్వాలి. ప్రస్తుతం వివిధ కళాశాలల్లో ల్యాప్‌ట్యాప్‌లు, కంప్యూటర్ల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ప్రతీ కళాశాలకు ఇన్‌ప్లాంట్స్‌ టేబుల్స్‌ కూడా రానున్నాయి. పెద్ద కంప్యూటర్‌ మానిటర్‌లో వెబ్‌సైట్‌ ద్వారా వీడియోలను విద్యార్థులు తిలకించనున్నారు. ఫిజిక్స్‌వాలా శిక్షణను విద్యార్థులు సరిగా వినియోగించుకుంటున్నారా లేదా అనేది హైదరాబాద్‌ నుంచి సంబంధిత అధికారులు కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా పర్యవేక్షిస్తారు. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా పర్యవేక్షణకు ప్రతీజిల్లాకు ఒకరి చొప్పున ఇన్‌చార్జ్‌లను నియమించారని సమాచారం. అలాగే డీఐఈఓలు కూడా పర్యవేక్షిస్తారు. అందుకు డీఐఈఓ కార్యాలయాల్లో కూడా సీసీ కెమెరాలకు సంబంధించి డ్యాష్‌ బోర్డును ఏర్పాటు చేయబోతున్నారు. ఒకవేళ సీసీ కెమెరాల్లో టెక్నికల్‌ సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేలా ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు ఒక టెక్నీషియన్‌ చొప్పున నియమించారు.

నిరంతర పర్యవేక్షణతో

విద్యాబోధన మెరుగు

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సీసీ కెమెరాల నిఘాతో నిరంతర పర్యవేక్షణతో పారదర్శకత పెరగనుంది. అధ్యాపకుల బోధన, విద్యార్థుల హాజరుపై పర్యవేక్షణ ఉండడంతో విద్యాబోధన మెరుగుపడుతుంది. విద్యార్థుల హాజరు పెరగడంతోపాటు అధ్యాపకులు విద్యాబోధనతో మెరుగైన ఫలితాలు వస్తాయి. ప్రయోగాలు చేయడం, టైంటేబుల్‌ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. జిల్లాల్లో డీఐఈఓలతో పాటు హైదరాబాద్‌ నుంచి కూడా నిఘా ఉండి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పలు సూచనలు, సలహాలు ఇస్తారు.

– శ్రీధర్‌సుమన్‌, వరంగల్‌ డీఐఈఓ

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో

ప్రభుత్వ కళాశాలల సంఖ్య ఇలా..

నిరంతర పర్యవేక్షణకు

సీసీ కెమెరాల ఏర్పాటు

ఒక్కో జూనియర్‌ కళాశాలకు

14 నుంచి 16 వరకు కేటాయింపు

విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన, ల్యాబ్‌ సౌకర్యం, ఫిజిక్స్‌వాలా శిక్షణ

హనుమకొండ 9 వరంగల్‌ 11

మహబూబాబాద్‌ 10 జనగామ 7

ములుగు 8 జయశంకర్‌ భూపాలపల్లి 5

ప్రభుత్వ కళాశాలల్లో నిఘా1
1/3

ప్రభుత్వ కళాశాలల్లో నిఘా

ప్రభుత్వ కళాశాలల్లో నిఘా2
2/3

ప్రభుత్వ కళాశాలల్లో నిఘా

ప్రభుత్వ కళాశాలల్లో నిఘా3
3/3

ప్రభుత్వ కళాశాలల్లో నిఘా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement