
అసంపూర్తి పనులతో అవస్థలు
జనగామ రూరల్: అసంపూర్తి బ్రిడ్జి నిర్మాణ పనులతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నిత్యం వేలాది మంది ప్రయాణించే ప్రధాన రోడ్డు కావడంతో ప్రమాదాలు సంబంధించే అవకాశం ఉంది. రెండేళ్ల క్రితం భారీ వర్షాలకు జనగామ, హుస్నాబాద్ రహదారి వడ్లకొండ వద్ద ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో గత ప్రభుత్వం నూతన బ్రిడ్జిని మంజూరు చేసింది. దీంతో ఓ కాంట్రాక్టర్ పనులను ప్రారంభించి పిల్లర్స్ వరకు పనులు పూర్తి చేశారు. ప్రయాణికులు, వాహనదారుల సౌలభ్యం కోసం పక్కనే తాత్కాలిక మట్టిరోడ్డును నిర్మించారు. ఆ రోడ్డు గతేడాది కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోగా పైప్‌లైన్ వేసి కంకర పోసి మళ్లీ రోడ్డు వేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు తాత్కాలిక రోడ్డు సైతం కోతకు గురై కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. పైగా మట్టి రోడ్డు కావడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణ విషయమై పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించినా స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు.
రాకపోకలకు అంతరాయం..
జనగామ నుంచి నర్మెట, తరిగొప్పుల, హుస్నాబాద్ నుంచి కరీంనగర్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. ఆర్టీసీ బస్సుల ద్వారా వివిధ గ్రామాల నుంచి విద్యార్థులు జనగామ పట్టణానికి ఉన్నత చదువులకు వస్తుంటారు. కరీంనగర్‌కు భారీ వాహనాలతో గ్రానైట్, వివిధ రకాల సరుకులు రవాణా అవుతుంటాయి. వీటితో పాటు నిత్యం జనగామ, గానుగపహడ్, వడ్లకొండ, మరిగడి, ఎర్రగొల్లపహడ్, అడవికేశాపురంతో పాటు తండా ప్రజలు ద్విచక్ర వాహనాలపై రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు కోతకు గురైతే పలు గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది.
పనులు త్వరగా పూర్తి చేయాలి
బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి. ఇటీవల వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. కొద్దిపాటి వర్షానికే కోతకు గురైంది. రాత్రి పూట ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. యుద్ధ ప్రాతిపాదికన బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి.
– ఇరుగు సిద్దులు, జనగామ
కోతకు గురవుతున్న తాత్కాలిక రోడ్డు
జనగామ, హుస్నాబాద్ ప్రధాన
రహదారిపై రాకపోకలకు ఇబ్బందులు
పట్టించుకోని పాలకులు,
అధికార యంత్రాంగం

అసంపూర్తి పనులతో అవస్థలు