
రేపే సాగునీరు విడుదల
స్టేషన్‌ఘన్‌పూర్: రేపటి (బుధవారం) నుంచి రిజ ర్వాయర్ల ద్వారా సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత సీజన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు వేసిన నార్లు, పంటలు ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ క్రమంలో రైతులను ఆదుకునే దిశగా దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్ల నుంచి ఆన్ ఆఫ్ పద్ధతిలో సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, మల్లన్నగండి, అశ్వరావుపల్లి రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెంచే ప్రయత్నం చేస్తున్నామని, ప్రస్తుతం రిజర్వాయర్లలో ఉన్న నీటితో రైతులు నాట్లు వేసుకునే అవకాశం ఉందన్నారు. ఽకాల్వల ద్వారా అందించే సాగునీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
బీసీ బిల్లుకు మద్దతు తెలపాలి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి బీసీలపై ప్రేమ ఉంటే ప్రభుత్వం పంపిన బీసీ బిల్లుకు మద్దతు తెలపాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. బీసీ బిల్లుపై కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని ఒప్పించడం చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలపై కపట ప్రేమ చూపిస్తుందని కిషన్‌రెడ్డి విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, లింగాజీ, ఎల్లయ్య, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి