
ముందస్తు ప్రణాళిక ముఖ్యం
జనగామ రూరల్: వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే విధంగా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని, భారీ వర్షాలతో ఎలాంటి ప్రమాదం కలుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల అమలు, సీజనల్ వ్యాధులు, తదితర విషయాలపై సోమవారం హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచి ఉప ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, పింకేష్‌కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొదించుకోవాలన్నారు. జిల్లాలోని ఫర్టిలైజర్ షాపులకు రెవెన్యూ, పోలీస్ అధికారులను నియమించే విధంగా వివరాలు ఇవ్వాలని వ్యవసాయ అధికారికి సూచించారు. జిల్లాలో రేషన్ కార్డులు ఇంకా ఎన్ని పంపిణీ చేయాలి, దరఖాస్తు పెండింగ్‌లో ఎన్ని ఉన్నాయి, తదితర వివరాలను అందించాలని సివిల్ సప్లయీస్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం చెరువుల నీటి నిల్వల వివరాలను రోజువారీగా సమర్పించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆర్డీఓ, తహసీల్దార్లు, అధికారులకు సూచించారు.
వీసీలో సీఎం రేవంత్‌రెడ్డి
పాల్గొన్న కలెక్టర్, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు