
జనాభా నియంత్రణకు కృషి చేయాలి
జనగామ రూరల్: జనాభా నియంత్రణకు సమష్టిగా కృషి చేసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఎక్కువగా చేపట్టాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్ రావుతో కలిసి అదనపు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్టాండ్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు వైద్య సిబ్బందితో జనాభా నియంత్రణపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 1987లో ఐక్యరాజ్య సమితి జనాభా నియంత్రణకు చర్యలు తీసుకోగా 1989 జూలై 11వ తేదీ నుంచి ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటించడం జరుగుతుందన్నారు. ఆశ కార్యకర్తలు ఇంటింటి సర్వే చేపట్టికొత్తగా వివాహం జరిగిన మహిళలను గుర్తించి 23 సంవత్సరాలు ఉండి, ఆరోగ్యవంతురాలిగా ఉన్నప్పుడే గర్భం దాల్చేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులకు తెలియ చెప్పాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ మహిళలు సంపూర్ణ ఆరోగ్య వంతురాలిగా ఉన్నప్పుడు గర్భం దాల్చినట్లయితే గర్భస్రావాల రేటు తగ్గుతుందన్నారు. అత్యధికంగా 700 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన డాక్టర్ శకుంతల, మోటివేషన్ పర్సన్ దీపారాణి, ఉత్తమ సేవలందించిన దేవరుప్పల మండల పీహెచ్‌సీకి చెందిన ఆశకార్యకర్త స్వప్నలను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్