
మద్యం ప్రియులకు షాక్
జనగామ: తెలంగాణ ప్రభుత్వం మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది. నైన్టీ వేయకుండానే మత్తెక్కిచే వార్త చెప్పింది. ఇటీవల బీర్ల ధరలు పెంచిన సర్కారు.. ఆదివారం అర్థరాత్రి నుంచి లిక్కర్ రేట్లను పెంచుతూ సర్క్యులర్ జారీ చేసింది. దీంతో మందు ప్రియులు ఒకింత కినుకుగా ఉన్నారు. జిల్లాలో 47 మద్యం దుకాణాలు, ఐదు బార్లు ఉన్నాయి. రోజు వారీగా రూ.1.10 కోట్ల మేర లిక్కర్, బీర్ల వ్యాపారం జరుగుతుంది. ఇటీవల లైట్ బీర్, స్ట్రాంగ్ బీర్లపై రూ.30 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లిక్కర్ వంతు వచ్చేసింది. పలు బ్రాండ్లకు సంబంధించి క్వార్టర్‌పై రూ.10, ఆఫ్‌కు రూ.20, ఫుల్‌పై రూ.40 పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆదివారం అర్థరాత్రి నుంచి కొత్త రేట్లు అందుబాటులోకి వస్తాయని సూచనలు చేసింది. ప్రతీరోజు క్వార్టర్, ఆఫ్ చొప్పున తీసుకునే మ ద్యం ప్రియులు పెరిగిన ధరలను ఆదా చేసుకునేందుకు ఒక్కసారే నెలకు సరిపడా స్టాక్ కొనుగోలు చేస్తున్నారు. బెల్ట్ దుకాణదారులు రోజు వారి స్టాక్ కంటే రెట్టింపు కొనుగోలు చేశారు. ధరల పెరుగుదలతో ఆవరేజ్‌గా ప్రతీరోజు మద్యం ప్రియులపై రూ.10లక్షల మేర అదనపు భారం పడనుంది.
లిక్కర్ ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం