
ఓరుగల్లుకూ ‘గొర్రెల స్కాం’ సెగ!
సాక్షిప్రతినిధి, వరంగల్ : గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాల బాగోతంపై మళ్లీ విచారణ ఉమ్మడి వరంగల్‌లో కలకలంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గొర్రెల పంపిణీలో అక్రమాల కేసును సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఏడాది క్రితం వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఏసీబీలు వేర్వేరుగా పలుకోణాల్లో విచారణ చేపట్టాయి. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ స్థాయి మొదలు ఆ శాఖ కీలక అధికారుల వరకు సుమారు 42 మందిపై మూడు శాఖలు అభియోగాలు మోపాయి. ఇందులో ఎనిమిది మంది ఉమ్మడి వరంగల్‌లో పనిచేసిన వారు కూడా ఉన్నారు. సుమారు రూ.700 నుంచి రూ.1,200 కోట్ల వరకు స్కాం జరిగినట్లు ప్రాథమిక నివేదిక ఇచ్చిన నిఘావర్గాలు.. కొందరినీ అరెస్టు చేసి.. మరికొందరిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేశాయి. ఆ కేసుల్లో ఉండి ఏడాదిలో ఉద్యోగ విరమణ చేసిన నలుగురు అధికారుల బెనిఫిట్స్ కూడా నిలిపి వేశారు. తాజాగా ఈ కుంభకోణంలో కీలక వ్యక్తిగా కాంట్రాక్టర్ మొయీనొద్దీన్ దుబాయికి పరారు కావడంతో అక్కడ బ్రేక్ పడింది. తాజాగా మొయీనొద్దీన్‌కు సంబంధించిన ఇంటిపై దాడులు నిర్వహించి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ.. ఆయన దగ్గర, ఆయన ద్వారా కొనుగోలు చేసిన పలువురిని విచారణకు పిలుస్తుండటం ఆశాఖలో కలకలం రేపుతోంది.
యూనిట్ల వివరాలపై ఈడీ నోటీసులు..
గొర్రెల పంపిణీలో గోల్‌మాల్ వ్యవహారం మనీ ల్యాండరింగ్‌గా భావించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. ఆ స్కాం గుట్టు తేల్చేందుకు చివరి ప్రయత్నంగా జిల్లాల వారీగా పంపిణీ చేసిన యూనిట్ల వివరాలు కోరింది. 2017 నుంచి 2024 వరకు పంపిణీ చేసిన యూనిట్ల సమాచారం కావాలని ఈ మేరకు జిల్లా వెటర్నరీ, పశుసంవర్దకశాఖ అధికారులకు ఇచ్చిన నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఈ వివరాలు గత నెలాఖరు వరకే ఈడీకి సమర్పించాల్సి ఉండగా, కొందరు అబ్‌స్ట్రాక్టు మాత్రమే ఇచ్చి, మరికొందరు సంపూర్ణంగా ఇవ్వగా.. రెండు జిల్లాల నుంచి సమాచారం వెళ్లలేదని తెలిసింది. పంపిణీ చేసిన గొర్రెల యూనిట్ల వివరాలు పంపించని అధికారులు ఈనెల 10 వరకు ఇవ్వాలని మరోసారి రిమైండర్ లేఖ పంపించినట్లు సమాచారం.
ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై దృష్టి
ఇదిలా ఉండగా 2017 నుంచి 2024 వరకు గొర్రెల పంపిణీ పథకంలో కీలకంగా వ్యవహరించి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై మళ్లీ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ దృష్టి సారించింది. వరంగల్ కేంద్రంగా ఉన్న కార్యాలయానికి చెందిన ఇద్దరు అధికారులపై రెండు నెలల క్రితం హనుమకొండ డీవీఏహెచ్‌ఓ కార్యాలయంలో ఆరా తీశారు. అలాగే గతంలో అరోపణలు ఎదుర్కోవడంతో పాటు సస్పెన్షన్‌కు గురై తిరిగి కొలువులో చేరిన కొందరికీ హైదరాబాద్ నుంచి ఏసీబీ మూడు రోజుల క్రితం నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
పశుసంవర్థకశాఖలో
మళ్లీ కలకలం
యూనిట్ల వివరాలు ఇవ్వాలని
ఈడీ నోటీసులు
డీవీఏహెచ్‌ఓలను ఆరా తీస్తున్న ‘విజిలెన్స్’
కొందరు వీఏఎస్‌లను విచారణకు పిలిచిన ఏసీబీ?
రిటైర్ అయినా తప్పని ఎంకై ్వరీ..
రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పైనా పేచీ..
వీటిలోనే అక్రమాల లెక్కలు..
ఉమ్మడి వరంగల్‌లో 2017 జూలైలో గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లోని గొల్ల, కురుముల కుటుంబాలను పరిగణనలోకి తీసుకొని గ్రామ సంఘంలో సభ్యత్వం ఉన్న వారికి రెండు విడతల్లో గొర్రెలు పంపిణీ చేశారు. మొదటి విడతలో 50 శాతం, రెండో విడతలో మరో 50 శాతం మంది చొప్పున 575 సహకార సంఘాలకు చెందిన 60 వేల మందికి మొదటి విడత(ఎ–లిస్టు)లో 49,276 యూనిట్లు పంపిణీ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రతి యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు చొప్పున జిల్లాల వారీగా కోటా నిర్ణయించారు. ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు ఏడీలు, ఒక డాక్టర్, ఇద్దరు పారా సిబ్బంది కమిటీగా.. ఉమ్మడి జిల్లాలో సుమారు 12 కమిటీల ద్వారా కొనుగోళ్లు, పంపిణీ చేపట్టారు. రెండో విడతలో 47,750 యూనిట్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. దాని ప్రకారం వరంగల్ అర్బన్ జిల్లాలో 5,571 యూనిట్లు, వరంగల్ రూరల్‌లో 12,748, మహబూబాబాద్‌లో 11,868, భూపాలపల్లి/ములుగు జిల్లాల్లో 6,791, జనగామ జిల్లాలో 10,772 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉండగా 12,123 యూనిట్ల తర్వాత అక్రమాలు వెలుగుచూడటంతో నిలిపివేశారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా విచారణకు ఆదేశించడం.. ఏడాది క్రితం అంతా అయిపోయిందని భావించిన తరుణంలో రెండు రోజులుగా మళ్లీ విచారణ స్పీడందుకుంది. ఉమ్మడి వరంగల్ అక్రమాలపైన మళ్లీ నోటీసులు జారీ కావడం లాంటి పరిణామాల నేపథ్యంలో బాధ్యులైన అధికారుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.