
మాట్లాడుతున్న కలెక్టర్ శివలింగయ్య
జనగామ: రాష్ట్రంలో ప్రస్తుత సంవత్సరంలో చేపట్టిన 9 నూతన వైద్య కళాశాలల పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. టీఎస్‌ఎంఐడీసీ డైరెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు, సంబంధిత ఇంజనీరింగ్ ఏజెన్సీలతో కలిసి మంగళవారం హైదరాబాద్ నుంచి మంత్రి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గత సంవత్సరం రికార్డు స్థాయిలో 8 నూతన వైద్య కళాశాలను ప్రారంభించుకోగా.. ప్రస్తుతం తొమ్మిది చోట్ల ప్రారంభానికి సిద్ధమవుతున్నాయన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య మాట్లాడుతూ జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మొదటి సంవత్సర తరగతుల నిర్వహణ కోసం ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల పీజీ బ్లాక్‌లలో తాత్కాలికంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చంపక్‌హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో పనులు త్వరితగతిన పూర్తి చేసేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. 40మంది పరుషులు, 60మంది మహిళా విద్యార్థినుల కోసం వేర్వేరుగా వసతి గృహాల కోసం పరిశీలన చేసినట్లు తెలిపారు. వీసీ అనంతరం ఆయా శాఖ అధికారులు, మెడికల్ కళాశాల ప్రొఫెసర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వీసీలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గోపాల్‌రావు, టీఎస్‌ఎంఐడీసీ ఇంజనీర్ దేవేందర్, డాక్టర్ సుగుణాకర్ రాజు, వైద్యాధికారులు డాక్టర్లు సుధీర్, అశోక్‌కుమార్, భాస్కర్, కరుణాకర్ రాజు, సంబంధిత ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది, వైద్య కళాశాల ప్రొఫెసర్లు ఉన్నారు.
వీసీలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు