న్యూస్‌రీల్
కొత్త డీజీపీ హయాంలోనైనా..
ప్రమోషన్లకు నోచుకోని 2012 బ్యాచ్ ఎస్సైలు
14 ఏళ్లయినా ఇంకా దక్కని సీఐ పదోన్నతి
జూనియర్లకు సెల్యూట్ చేయాల్సిన దుస్థితి
సొంత బ్యాచ్‌లో అసమానతలతో విధులు
కనీసం అడహక్ ప్రమోషన్లు ఇవ్వాలంటూ డిమాండ్
కొత్త డీజీపీ హయాంలోనైనా నెరవేరాలని ఆశాభావం
జగిత్యాల
మూడు చుక్కల
ఆదివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2026
సాక్షి,ప్రతినిధి, కరీంనగర్:
వారంతా 2012 బ్యాచ్ సబ్‌ఇన్‌స్పెక్టర్లు, కానీ సర్వీసులో తమ కన్నా జూనియర్లయిన సీఐ (2014 ఎస్సైలు)లకు సెల్యూల్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర పోలీస్‌శాఖలో 2012 బ్యాచ్ సబ్ ఇన్‌స్పెక్టర్ల పరిస్థితి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 14 ఏళ్ల సుదీర్ఘ సేవలు పూర్తి చేసుకున్నప్పటికీ, ఇంకా రెండు చుక్కల హోదాలోనే కొనసాగుతుండటం వారిలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. నిబంధనల ప్రకా రం ఆరేళ్లు సేవ పూర్తయ్యాకే సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) ప్రమోషన్‌కు అర్హత సాధించారు. అర్హత సాధించి ఎనిమిదేళ్లు గడిచినా పదోన్నతులు అందకపోవడం గమనార్హం. ఇప్పటికే అదే బ్యాచ్‌లో కొందరు సీఐలుగా పదోన్నతులు పొంది ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారు ఇంకా ఎస్సైలు గానే కొనసాగుతున్నారు. దీంతో ఒకే బ్యాచ్‌లో తీవ్ర అసమానత నెలకొంది. మరోవైపు 2014 బ్యాచ్‌కు చెందిన కొందరు ఇప్పటికే సీఐలుగా ప్రమోషన్ పొందడంతో 2012 బ్యాచ్ ఎస్సైలు తమ కన్నా జూనియర్లకు సెల్యూట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు 2018 బ్యాచ్ మహిళా ఎస్సైలు కూడా సీఐ ప్రమోషన్‌కు అర్హత సాధించడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
జోనల్ మార్పులతో వెనుకబడిన 2012 బ్యాచ్
ప్రభుత్వం అమలు చేసిన కొత్త జోనల్ వ్యవస్థ, ముఖ్యంగా 317 ప్రభావంతో పాత జోన్‌ల నుంచి పెద్ద సంఖ్యలో అధికారులు మారడంతో 2012 బ్యాచ్ సీనియారిటీ తీవ్రంగా ప్రభావితమైంది. ఇతర జోన్ల నుంచి వచ్చిన అధికారులు ప్రమోషన్లు పొందగా.. అసలు సీనియారిటీ ఉన్న పలువురు 2012 బ్యాచ్ ఎస్సైలు మాత్రం వెనుకబడ్డారు.
ఎస్‌హెచ్‌ఓ పోస్టులు సీఐల చేతుల్లోనే
మల్టీజోన్–1 పరిధిలోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్, రామగుండం, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట తదితర జిల్లాల్లోని అనేక పోలీస్‌స్టేషన్లలో ఎస్‌హెచ్‌వో పోస్టులను ప్రస్తుతం సీఐలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దాదాపు 20 పోస్టులు ఈ తరహాలో ఉన్నాయని తెలుస్తోంది. ఇది శాఖలో సీఐ స్థాయి అవసరం ఎంతగా ఉందో స్పష్టంగా తెలియజేస్తోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగ విరమణ వయసు 58 నుంచి 61 ఏళ్లకు పెంచడంతో పైస్థాయి అధికారుల పదవీ కాలం పొడిగించారు. దీని ప్రభావం ప్రమోషన్ చైన్‌పై పడింది. పైస్థాయిలో ఖాళీలు లేకపోవడంతో దిగువస్థాయి ఉద్యోగుల ప్రమోషన్లు సంవత్సరాల తరబడి నిలిచిపోతున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యధిక కాలం ఎస్సైలుగా కొనసాగుతున్న బ్యాచ్ మాదే’ అంటూ 2012 బ్యాచ్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 14 ఏళ్ల సేవ పూర్తి చేసినా పదోన్నతి రాకపోవడం తమ కెరీర్ ప్రోగ్రెషన్‌ను తీవ్రంగా దెబ్బతీసిందని చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2012లో ఎస్సైల సంఖ్య 1,044 మంది. రాష్ట్ర ఆవిర్భావంతో 544 మందిని తెలంగాణకు కేటాయించారు. ఈ బ్యాచ్‌లో కేవలం 180 మందికి పదోన్నతి సాధించగా,, ఐదుగురు మరణించారు. ఇంకా 364 మందికి పదోన్నతి రావాల్సి ఉంది. ఇక 2014 బ్యాచ్‌లో ముగ్గురికి సీఐలుగా ప్రమోషన్ వచ్చింది. రాష్టవ్యాప్తంగా 60 సీఐ ర్యాంకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనీసం వీటిలోనైనా అవకాశం కల్పిస్తే.. కొందరికైనా సీఐ పదోన్నతి వస్తుందని, మిగిలిన వారికి అడ్‌హక్ ప్రాతిపదికన పదోన్నతులు కల్పించాలని కోరుతున్నారు. కనీసం కొత్త డీజీపీ హయాంలోనైనా 2012 బ్యాచ్‌కు న్యాయం దక్కాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


