ఫీజు ఇవ్వరు.. పన్ను కట్టరు | - | Sakshi
Sakshi News home page

ఫీజు ఇవ్వరు.. పన్ను కట్టరు

Mar 30 2026 8:40 AM | Updated on Mar 30 2026 8:40 AM

అనుమతులు ఒకలా.. కట్టడాలు మరోలా ఇష్టారాజ్యంగా గ్రానైట్‌ కటింగ్‌ పరిశ్రమల తీరు ఇంటి నంబర్లు సైతం పొందని పలు పరిశ్రమలు అయినా ఇవేవీ పట్టనట్లు సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/కొత్తపల్లి(కరీంనగర్‌):

కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న గ్రానైట్‌ కటింగ్‌, పాలీిషింగ్‌ పరిశ్రమల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అనుమతులు పొందే సమయంలో ఒక విధంగా, నిర్మాణ సమయంలో మరో విధంగా కట్టడాలు చేపట్టి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. పలు పరిశ్రమలు ఇంటి నంబర్లు పొందకుండానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. సామాన్యుడు ఇంటి నిర్మాణం చేపడితే క్షణాల్లో వాలిపోయే అధికారులు.. గ్రానైట్‌ పరిశ్రమల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమల నిర్వహణ కొనసాగుతున్నా సంబంధిత అధికారులెవరూ కన్నెత్తి చూడడం లేదు.

పరిశ్రమల అనుమతులపై అనుమానాలు?

కొత్తపల్లి మండలంలోని గ్రానైట్‌ కటింగ్‌, పాలీషింగ్‌ పరిశ్రమలు పొందిన అనుమతులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీరాజ్‌ చట్టం 2018 ప్రకారం పరిశ్రమ స్థాపనకు అనుమతి పొందాలంటే టీఎస్‌ ఐపాస్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వివిధ ప్రభుత్వశాఖల నుంచి ఎన్‌వోసీ పత్రాలు జతచేస్తూ దరఖాస్తు పూర్తి చేయాలి. సింగిల్‌విండో పద్ధతిలో అనుమతి మంజూరు కోసం సాంకేతిక(టెక్నికల్‌) అనుమతికి సుడా/డీటీసీపీ(డిస్ట్రిక్ట్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ ఆఫీసర్‌)కు దరఖాస్తు ఫార్వర్డ్‌ చేయబడుతుంది. పరిశ్రమ స్థాపించేందుకు పరిపాలన అనుమతుల కోసం సంబంధిత గ్రామ పంచాయతీలకు సుడా /డీటీసీపీ ఆ దరఖాస్తును ఫార్వర్డ్‌ చేస్తుంది. పంచాయతీ అనుమతి వచ్చాక సుడా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశ్రమకు సంబంధించిన నిర్మాణం కొలతలపై విచారణ చేపట్టి సాంకేతిక (టెక్నికల్‌) అనుమతి ఇవ్వాలి. అప్పుడు పంచాయతీ గ్రామసభ అనుమతి పొందాక సంబంధిత పరిశ్రమ యజమాని నిర్మాణ ఫీజు, బెట్టర్‌మెంట్‌ చార్జ్‌, డెవలప్‌మెంట్‌ చార్జిలు చెల్లించాక అనుమతులివ్వాలి. అప్పుడే పరిశ్రమ నిర్మాణ పనులు చేపట్టాలి. కానీ వాటిని తుంగలో తొక్కుతూ సుడా అనుమతి ఉందంటూ గ్రామ పంచాయతీలకు ఫీజు చెల్లించకుండా నిర్మాణాలు పూర్తి చేస్తున్నాయి. దీంతో పంచాయతీల ఆదాయానికి గండి పడుతోంది.

అనుమతులు ఒకలా..నిర్మాణాలు మరోలా

కొత్తపల్లి మండలంలోనే 300 పైగా గ్రానైట్‌ కలింగ్‌, పాలీషింగ్‌ పరిశ్రమలుండగా జిల్లావ్యాప్తంగా మరికొన్ని పరిశ్రమలది ఇదే పరిస్థితి అని తెలుస్తోంది. కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌, ఖాజీపూర్‌, ఎలగందుల, బద్ధిపల్లి, కమాన్‌పూర్‌ గ్రామాల్లోని పలు పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను విస్మరించాయి. అనుమతుల సమయంలో ఒకలా.. నిర్మాణ సమయంలో మరోలా కట్టడాలు చేపట్టారు. గ్రానైట్‌ పరిశ్రమల అనుమతులపై కలెక్టర్‌ స్పందించి సమగ్ర విచారణ చేపడితేనే వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.

ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు ఎగవేత

గ్రానైట్‌ కటింగ్‌, పాలీషింగ్‌ పరిశ్రమలు ఇంటి శిస్తుతో పాటు ట్రైడ్‌ లైసెన్స్‌ ఫీజు కూడా ఎగవేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు 100 హార్స్‌పవర్‌(హెచ్‌పీ)పైన విద్యుత్‌ వినియోగిస్తున్న పరిశ్రమలు ఏడాదికి రూ.7 వేలు, 100 హెచ్‌పీ లోపు విద్యుత్‌ వినియోగిస్తే రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇవేవీ చెల్లించకుండా గ్రానైట్‌ పరిశ్రమల యజమానులు దర్జాగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయమైన జిల్లా పంచాయతీ అధికారిని ఫోన్‌లో వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement