జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి జిల్లాకు సాగునీరు అందించే కాకతీయ కాలువ శిథిలావస్థకు చేరింది. కాలువకు ఇరువైపులా పెద్దపెద్ద చెట్లు పెరిగి సిమెంట్ లైన్లు పగిలిపోయాయి. ఎక్కడికక్కడే కాలువ దెబ్బతింటోంది. నీటి ప్రవాహం ఒత్తిడికి కాలువకు గండ్లు పడుతున్నాయి. దీంతో కాలువకు అత్యధికంగా 8,300 క్యూసెక్కుల సామర్థ్యంతో నీటిని వదలాల్సి ఉండగా.. కేవలం 6,000 క్యూసెక్కులకు మించి వదిలే పరిస్థితి లేకుండా పోయింది. కాలువ పరిస్థితిని బట్టి నాలుగు నుంచి ఐదు వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే వదులుతుండటంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం గగనంగానే మారింది.
జిల్లాలో 94 కిలోమీటర్ల వరకు కాకతీయ కాలువ
కాకతీయ కాలువ ప్రారంభం నుంచి ఎల్‌ఎండీ వరకు 146 కిలోమీటర్ల వరకు ఉండగా.. జిల్లాలో 94 కిలోమీటర్ల వరకు కాకతీయ కాలువ ప్రవహిస్తుంది. ఒక్క జిల్లాలోనే దాదాపు లక్ష ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. కాకతీయ కాలువకు గతంలో వేసిన సిమెంట్ లైనింగ్ దెబ్బతినడం, చెట్లు విరిగి, నీటికి అడ్డంకిగా మారడంతో నీటి ఒత్తిడి పెరిగి గండ్లు పడుతున్నాయి. ఎప్పటికప్పుడు మరమ్మతు చేయాల్సి ఉన్నప్పటికీ.. పెద్దగా నిధులు విడుదల చేయకపోవడంతో కాలువ శిథిలమవుతోంది. కొన్నేళ్ల క్రితం ప్రపంచబ్యాంకు నిధులతో అక్కడక్కడ మరమ్మతు చేసినప్పటికీ పెద్దగా ఒరిగిందేమీ లేదు. కాకతీయ కాలువలో ప్రస్తుతం ఉన్న లోతుకు అదనంగా మీటర్ లోతు పెంచాలని, వెడల్పు పెంచి, అధిక నీటిని తరలించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికి, ఈ విషయంలో ప్రభుత్వం పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు.
కాకతీయ కాలువకు గండ్లు
మల్యాల, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో కాకతీయ కాలువకు గండ్లు పడ్డాయి. ఆ సమయంలో రైతులు సాగు చేసిన పంట పొలాలు దెబ్బతిన్నాయి. కేంద్ర బృందం వచ్చి పరిశీలించినా రైతులకు నష్టపరిహారం రాలేదు. కాకతీయ కాలువతోపాటు డిస్ట్రిబ్యూటరీలు, సబ్ డిస్టిబ్యూటరీలు, ఉపకాలువల లైనింగ్ దెబ్బతిన్నాయి. తూములు పడిపోయాయి. షట్టర్లు విరిగిపోయాయి. ప్రధాన కాలువకు ఉన్న యూటీలు, అక్విడెట్లు, డ్రాపులు, సూపర్ ప్యాసెజ్‌లు దెబ్బతిన్నాయి. ప్రధాన కాలువకు ఎప్పుడు ఇబ్బందులు తలెత్తుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ యూటీలు, అండర్‌ప్యాసెజ్‌ల వద్ద నీరు లీకేజీ అవుతూనే ఉంది. దీంతో పూర్తి స్థాయిలో కాలువకు నీటిని విడుదల చేయకపోవడం.. కొద్దిపాటి నీటిని విడుదల చేస్తే, కాలువకు ఇరువైపులా మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తుండటంతో చివరి ఆయకట్టుకు నీరు అందడం గగనంగా మారింది.
కాలువ పర్యవేక్షణ అంతంతమాత్రమే
నీటి పారుదల శాఖ పరిధిలో ఉండే ఎస్సారెస్పీ కాలువల మరమ్మతులకు నిధులు విడుదల చేయకపోవడం, పర్యవేక్షణకు సిబ్బంది లేకపోవడంతో.. ఎక్కడికక్కడే కాలువలు శిథిలావస్థలో దర్శనమిస్తున్నాయి. కాలువకు నీరు విడుదల చేసే ముందు కాలువలో ఉన్న చెత్తాచెదారాన్ని, విరిగిన చెట్లు, కాలువ గట్ల నుంచి వచ్చేవరద నీటితో చేరిన మట్టిని తొలగించడం లేదు. దీంతో కాలువలో ఉన్న కట్టెలు, చెత్తాచెదారం కొట్టుకొచ్చి డ్రాపుల వద్ద ఆగుతుండడంతో నీరు ఆగి, కాలువ గట్లకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
కాకతీయ కాలువకు మరమ్మతు శూన్యం
ఏటా తగ్గుతున్న కాలువ నీటి సామర్థ్యం
నిధులు లేవు.. పర్యవేక్షణ అంతంతే


